పవన్ కల్యాణ్ కి తత్వం బోధపడింది. బీజేపీతో పొత్తు తర్వాత జనసేన ఎంత బలహీన పడిందో క్రమంగా అర్థమవుతోంది. ఎలాగూ పార్టీ నడపాలన్న ఆసక్తి ఆయనలో లేదు కాబట్టి విషయం అర్థమైనా పైకి గంభీరంగా కనపడుతున్నారు. కొత్తరక్తం రావాలి, కొత్తనాయకత్వం జనసేనకి అవసరం అంటూ అరిగిపోయిన క్యాసెట్టే వేస్తున్నారు. అయితే తాజాగా రేపల్లె నియోజకవర్గ సమీక్ష సమావేశం అంటూ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకున్న పవన్ కల్యాణ్ కి పెద్ద షాకే తగిలింది.
పట్టుమని పాతిక మంది కూడా లేకపోయే సరికి పవన్ అవాక్కయ్యారు. నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమంటే కనీసం హాల్ నిండా కార్యకర్తల్ని తీసుకురావాలి కదా అని నేతలపై అసహనం వ్యక్తం చేశారు పవన్. రాజకీయ మురికిని శుభ్రం చేయడానికే మనం పార్టీ పెట్టాం, కొత్త నాయకత్వంతో సరికొత్త చరిత్ర సృష్టిద్దామంటూ మీటింగ్ లో ఉపదేశాలిచ్చిన పవన్, అది కాస్తా పూర్తయ్యాక అసలు మనిషిని బైటకు తెచ్చారు.
నియోజకవర్గ ఇంచార్జిలను పిలిపించుకుని కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. పార్టీ మీటింగ్ ఆ మాత్రం జనాల్ని తీసుకురాలేనివారు.. ఇంకేం రాజకీయాలు చేస్తారంటూ మండిపడ్డారట. వచ్చిన వారిలో అందరూ అభిమానులే. పవన్ ని తొలిసారి దగ్గర నుంచి చూడాలన్న ఆసక్తితో వచ్చినవారే. మీటింగ్ తర్వాత ఫొటోల కోసం వీళ్లంతా ఎగబడటంతో పవన్ కోపం నషాళానికంటింది.
అసలే.. చంద్రబాబు అవినీతిపై స్పందించాలని వైసీపీ పరువు తీస్తున్న వేళ, షూటింగ్ గ్యాప్ లో రెండు మీటింగ్ లు పెట్టుకుని ప్యాకప్ చెప్పాలనుకుంటున్న పవన్ కి సొంత పార్టీ నేతలే చిరాకు తెప్పించారు. దీంతో ఇటీవల ఎప్పుడూ లేనంతగా పవన్ అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ షాక్ తో పవన్ ఇంకొన్నాళ్లు.. నియోజకవర్గ మీటింగ్ లు, సమీక్షలకు దూరంగా ఉండిపోతారేమోనని జనసేనలో గుసగుసలు మొదలయ్యాయి.