తెలంగాణ బీజేపీకి జనసేనాని పవన్‌కల్యాణ్ షాక్ ఇచ్చారా? అంటే ఔనని చెప్పక తప్పదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్టు జనసేనాని పవన్ తాజాగా ప్రకటించారు.
దీంతో ఒక్కసారిగా బీజేపీ-జనసేన మధ్య సంబంధాలపై చర్చ మొదలైంది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం క్రియాశీల కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల బరిలో జనసేన నిలవనున్నట్టు ప్రకటించి బీజేపీకి షాక్ ఇచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ … అదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది.
జాతీయ నాయకులతో కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికలకు సమాయాత్తమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండడంతో బీజేపీ ఓ 50 మంది అభ్యర్థుల జాబితాను నేటి రాత్రి ప్రకటించవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటన కీలకంగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో, వారి అభీష్టం మేరకు పోటీ చేయనున్నట్టు పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
అయితే బీజేపీ -జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల నేతలు ఇంత వరకూ ప్రకటించలేదు. పైగా ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారు.
మరోవైపు ఏపీలో బీజేపీ -జనసేన మధ్య పొత్తు ఉంది. మరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం వల్ల ఒక సామాజిక వర్గంతో పాటు సెటిలర్స్ ఓట్లలో చీలిక ఏర్పడి నష్టం వస్తుందనే భావన బీజేపీలో ఉంది.
ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి చాలా స్వల్ప వ్యవధి ఉండడం, జనసేనాని ఆకస్మిక నిర్ణయం ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందోననే చర్చకు దారి తీసింది.