మారాలి పవన్: మొన్న మీడియం.. ఇప్పుడు రాజధాని

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. తెలుగు భాషోద్ధారకుల మాదిరిగా ఫోజులు కొట్టిన చాలామంది చివరకు చప్పబడిపోయారు. పేద…

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. తెలుగు భాషోద్ధారకుల మాదిరిగా ఫోజులు కొట్టిన చాలామంది చివరకు చప్పబడిపోయారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులొద్దా, మీ పిల్లలు మాత్రం కాన్వెంటుల్లో చదవాలా అనే ప్రశ్నలు తలెత్తేసరికి తలలు దించుకున్నారు. పత్రికల రాద్ధాంతం కూడా ఓ కొలిక్కి వచ్చేసింది.

ఇంగ్లిష్ మీడియానికి మేం వ్యతిరేకం కాదు అనే దగ్గరనుంచి, తెలుగు మీడియాన్ని కూడా అవసరమైన చోట్ల కొనసాగించాలి అనే వరకు వచ్చారు. ఆ తర్వాత అది కూడా పక్కనపెట్టేశారు. చంద్రబాబు ఏకంగా యూ టర్న్ తీసుకుని గతంలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది తానేనంటూ అసెంబ్లీలో క్రెడిట్ కొట్టేయాలని చూశారు. వాళ్లని, వీళ్లని చూసి రెచ్చిపోయిన పవన్ కల్యాణ్ కూడా 'మన నుడి' ని కాస్త పక్కనపెట్టారు.

ఇక ఇప్పుడు మూడు రాజధానుల అంశం. ఇది కూడా తెలుగు మీడియంలాగే మారిపోతోంది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి నానా రచ్చ చేశారు. పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. ఆ తర్వాత తత్వం బోధఫడింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా చంద్రబాబు పూర్తిగా సైలెంట్ అయ్యారు. జి.ఎన్.రావు నివేదిక వచ్చాక స్పందిస్తానని ఒకసారి, మంత్రిమండలి సమావేశమయ్యాక మాట్లాడతానని మరోసారి స్టేట్ మెంట్లిచ్చారు జనసేనాని. చివరికి అమరావతిలో జనసేన నేతల పర్యటన వివరాలని కూడా ప్రస్తావించలేకపోయారు.

మొత్తమ్మీద అమరావతిని మాత్రమే సమర్థించేవారికి ఉత్తరాంధ్ర, రాయలసీమలో తీవ్ర వ్యతిరేకత రావడంతో నాయకులంతా తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. మెల్లమెల్లగా మాట మార్చుకుంటున్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు, ముందు అమరావతి సంగతి తేల్చండి అంటూ పట్టుబడుతున్నారు. కొన్నిరోజులు తర్వాత వికేంద్రీకరణ ఐడియా నాదేనంటూ చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక పవన్ సంగతి చెప్పేదేముంది. బాబు యూటర్న్ తర్వాత పవన్ కూడా మారాల్సిందే. స్వయంగా అన్నయ్య చిరంజీవి, మూడు రాజధానులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం పవన్ కు పెద్ద షాక్. సో.. పవన్ కూడా తెలుగు మీడియం టైపులోనే 3 రాజధానుల అంశాన్ని కూడా మెల్లగా మరిచిపోయే ప్రయత్నంలో ఉన్నారు. ఊసరవెల్లి రాజకీయాలంటే ఇవే మరి. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మన నాయకులు నిర్ణయాలను, అభిప్రాయాలను అంతే వేగంగా మార్చకుంటున్నారు. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మంచిని చూడకుండా, కేవలం రాజకీయాలు-వివాదాలు మాత్రమే చేయాలనుకుంటే ఇలానే ఉంటుంది. ఇప్పటికైనా పవన్ తన వ్యవహారశైలి మార్చుకుంటే మంచిది