సాధారణంగా సినిమా విడుదలకు ముందు ప్రివ్యూలు వేస్తుంటారు. కొంతమంది ప్రముఖులు లేదా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే చూపిస్తారు. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ప్రీమియర్స్ కూడా ఉంటాయి. కానీ దిల్ రాజు మాత్రం తన సినిమాను ఏకంగా 5 రోజుల ముందు నుంచే చూపిస్తున్నాడు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీ స్టూడెంట్స్ కు చూపిస్తున్నాడు.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా ఇద్దరి లోకం ఒకటే. క్రిస్మస్ కానుకగా బుధవారం ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాను హైదరాబాద్ లోని ఓ కాలేజీ విద్యార్థులకు చూపించారు. కేవలం సినిమాపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకే ఈ పని చేశామని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి యూత్ కు చూపించామని అంటున్నాడు.
ఇక్కడితో ఆగట్లేదు దిల్ రాజు. ఈరోజు నెల్లూరులోని ఓ కాలేజ్ కు చెందిన స్టూడెంట్స్ కు సినిమా చూపించబోతున్నాడు. రేపు వైజాగ్ లోని మరో కాలేజ్ స్టూడెంట్స్ కు చూపించబోతున్నాడు. ఇలా విడుదలకు ముందే 3 ప్రాంతాల్లో వందల మంది స్టూడెంట్స్ కు ఈ సినిమా చూపించేస్తున్నాడు దిల్ రాజు.
ఇలా చేయడం వల్ల తమ సినిమా మౌత్ పబ్లిసిటీతో యూత్ కు బాగా దగ్గరవుతుందనేది దిల్ రాజు ఆలోచన. సినిమా నిజంగా బాగుంటే దిల్ రాజు ప్లాన్ వర్కవుట్ అవుతుంది. కంటెంట్ తేడా కొడితే మాత్రం మొదటి రోజేకే సినిమా ఖాళీ అయిపోతుంది. దీనికితోడు అత్యుత్సాహంతో విద్యార్థులు కంటెంట్ ను రికార్డ్ చేస్తే అదో తలనొప్పి. దిల్ రాజు అనుసరిస్తున్న ఈ కొత్త తరహా విధానం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.