ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం కంపు కొడుతోంది. అయితే రాజకీయాల్లో కులం అనేది వాస్తవం కాబట్టి… అది కొందరికి సువాసన అనిపిస్తోంది. ప్రధానంగా ఏపీలో రాజకీయాలు కులాల వారీగా విడిపోయాయన్నది వాస్తవం. సంక్షేమ పథకాలు, ఇతరత్రా అంశాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయన్నది పచ్చి అబద్ధం. ఇవి కొంత వరకు మాత్రమే పనిచేస్తాయి. ప్రధానంగా కులాలు, మతాల మొగ్గును బట్టే అధికార మార్పిడి జరుగుతూ వుంటుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో జనసేనాని పవన్‌కల్యాణ్ కులం స్టాండ్ తీసుకోవడం కొత్త పరిణామంగా చెప్పొచ్చు. పవన్ మనసులో ఇంత కాలం ఏమున్నదో కానీ, తన కులం అండలేనిదే రాజకీయాల్లో రాణించలేననే తత్వం ఆయనకు బోధ పడినట్టుంది. అందుకే ఇటీవల రాజమండ్రిలో శ్రమదానం నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో మార్పునకు కాపులు పెద్దరికం వహించాలని కోరారు. కాపుల్లోని వివిధ తెగలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కాపుల చైతన్యంతోనే సమాజంలో మార్పు వస్తుందని పవన్ స్పష్టం చేయడాన్ని గమనించొచ్చు. తనపై కోపంతో కాపు జాతిని తిట్టడం ఎందుకని ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వెనుక పక్కా వ్యూహం కనిపిస్తోంది. ఆ తర్వాత వంగవీటి రాధా కూడా ఇదే రీతిలో మాట్లాడారు. కాపులు తలచుకుంటే ప్రభుత్వాలను పడగొట్టొచ్చని హెచ్చరించారు. కాపులంతా ఐక్యం కావాలని ఆయన కోరారు.
గతంలో వంగవీటి మోహన్‌రంగాను పోగొట్టుకున్నట్టుగా, ప్రస్తుత నాయకుడిని బలి పెట్టుకోవద్దని ఆయన పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాపు ప్రజానీకం ఐక్యంగా ఉంది. లేనిదల్లా ఆ సామాజిక వర్గ నాయకులే.
పవన్‌కల్యాణ్, వంగవీటి రాధా మాటలు వింటే…కాపులంతా ఐక్యం కావాలనే భావన కనిపిస్తుంది. కాపుల వైపు నుంచి ఆలోచిస్తే ఇది మంచిదే. కానీ సమస్యల్లా కాపు నాయకులతోనే. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల తర్వాత అత్యధిక జనాభా కలిగిన తాము అధికారంలోకి రావాలని కాపులు ఆకాంక్షిస్తున్నారు. ఇదేమీ తప్పు కాదు. కేవలం నాలుగైదు శాతం మాత్రమే జనాభా కలిగిన రెడ్డి, కమ్మ సామాజిక వర్గ నేతలు ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు, బీసీలు, కాపులు ఆ పదవిని ఆశించడంలో అతిశయోక్తి ఏముంది?
కాపు సామాజిక వర్గ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు నాయకులు ఆత్మగౌరవంతో వ్యవహరించడం లేదనే విమర్శ ఉంది. ఉదాహరణకు వంగవీటి రాధానే తీసుకుందాం. ప్రస్తుతం ఆయన ఏ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారో తెలుసుకుంటే, సరైన సమాధానం దొరుకుతుంది.
తన తండ్రిని అంతమొందించిన పార్టీలో ఆయన కొనసాగుతున్నారనే వాస్తవాన్ని కాపులు జీర్ణించుకోలేకున్నారు. అలాంటప్పుడు వంగవీటి మోహన్‌రంగాను పోగొట్టుకున్నట్టుగా, పవన్‌కల్యాణ్‌ను దూరం చేసుకోవద్దని ఆయన ఎలా పిలుపునిస్తారనే ప్రశ్న సహజంగానే పౌర సమాజం నుంచి వస్తోంది.
ఇక పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే… ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో తాను నిలకడలేని రాజకీయాలు చేస్తున్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు రాజకీయాలు చేయడం మాని, జగన్‌కు ఆ పదవి దక్కకూడదనే ఈర్ష్య, అసూయతో పవన్ పొలిటికల్ సర్కస్ ఫీట్స్ చేస్తున్నారనే విమర్శ బలంగా ఉంది. ఇది రాజకీయాల్లో ఎప్పటికీ మంచిది కాదు. ఎన్నికలతో సంబంధం లేకుండా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న పవన్‌కల్యాన్, ప్రస్తుతం ఆ పార్టీతో కూడా కలిసి ప్రయాణించడం లేదు.
ఇప్పుడాయన టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీని వల్ల ప్రయోజనం ఎవరికి? అంతిమంగా మరోసారి చంద్రబాబునో, ఆయన తనయుడు లోకేశ్‌నో ముఖ్యమంత్రి చేయడానికి పవన్‌కల్యాణ్ శ్రమించాల్సి వుంటుంది. దీని కోసమా పవన్‌కల్యాణ్ నాయకత్వాన్ని కాపులు భుజాన మోస్తున్నది!
ఇదే బీజేపీతో పొత్తులో వుంటే, తానే సీఎం అభ్యర్థిగా బరిలో తలపడాల్సి వుంటుంది. గెలిచినా ఓడినా కనీసం పరువైనా దక్కుతుంది. ఇందుకు విరుద్ధంగా కమ్మ నేతను సీఎం చేసేందుకు కాపుల ఆకాంక్షలను బలిపెట్టడం పవన్‌కల్యాణ్‌కు సబబని అనిపిస్తోందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
కమ్మ, రెడ్డి …ఈ రెండు కులాలు కాకుండా ఇతర సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో ప్రాతినిథ్యం దక్కించుకునేందుకు నాయకత్వం వహించాలనే స్పృహ పవన్‌కల్యాణ్‌లో ఎందుకు కొరవడిందో అర్థం కావడం లేదు. తాత్కాలికంగా జగన్‌పై రాజకీయ ప్రతీ కారం తీర్చుకునేందుకు చంద్రబాబుతో జత కట్టాలని పవన్ భావిస్తే మాత్రం ముఖ్యంగా తన సామాజిక వర్గానికి తీరని ద్రోహం చేసినట్టేనని పవన్ గుర్తించాల్సి వుంది.
ఒక నేతపై అక్కసుతో, మరో నేతకు తమ సామాజిక వర్గ ప్రయోజనాలను బలి పెట్టడాన్ని భావితరాలు ఎప్పటికీ క్షమించదని పవన్‌కల్యాణ్ గమనంలో పెట్టుకోవాలి. తన సామాజిక వర్గ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని రాజకీయంగా అడుగులు వేయాలని కాపులు కోరుకుంటున్నారు.