కాపు నాయకుడు పవనా..? చిరంజీవా..?

పవన్ కల్యాణ్ కి కౌంటర్ గా మంత్రి పేర్ని నాని చెప్పిన మాటల్లో ఓ ఓ విషయం స్పష్టమవుతోంది. కాపులంతా కమ్మల్ని భుజాన మోస్తున్నారని చెప్పారాయన. “జనసేన కార్యకర్తలకు మరోసారి నమస్కారం. మీ భుజాలపై…

పవన్ కల్యాణ్ కి కౌంటర్ గా మంత్రి పేర్ని నాని చెప్పిన మాటల్లో ఓ ఓ విషయం స్పష్టమవుతోంది. కాపులంతా కమ్మల్ని భుజాన మోస్తున్నారని చెప్పారాయన. “జనసేన కార్యకర్తలకు మరోసారి నమస్కారం. మీ భుజాలపై కమ్మవారిని మోస్తున్నారు, అదే జరగబోతోంది” అన్నారు నాని. 

పరోక్షంగా చిరంజీవి ప్రస్తావన తెచ్చారు. చిరంజీవి కర్రలాంటి వారని, దాని ఆధారంగా అల్లుకున్న తీగ పవన్ అని అన్నారు. పవన్ తన సభలో చిరంజీవికి ఎందుకు నమస్కరించలేదని ప్రశ్నించారు. ఒక రకంగా కాపుల్లో చిరంజీవిని హైలెట్ చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని చెప్పొచ్చు. ఇక తేల్చుకోవాల్సింది కాపులే. తమ నాయకుడు చిరంజీవా..? పవన్ కల్యాణా..?

చిరంజీవి రూటేది..?

ఇప్పటి వరకూ చిరంజీవి నేరుగా జగన్ కి జై కొట్టలేదు, వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను ఏనాడూ విమర్శించలేదు. పైగా మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు. సినిమా టికెట్ల రేట్లపై విభేదించినా సామరస్యంగా సమస్య పరిష్కరించుకున్నారు. 

పవన్ పోరాటాలను మెచ్చుకుంటున్నా.. రాజకీయంగా ఆయనకు ఎప్పుడూ మద్దతు తెలపలేదు. అంటే ఒక రకంగా చిరంజీవి మద్దతు వైసీపీకే ఉన్నట్టు లెక్క. అంటే చిరంజీవిని ఇష్టపడే అభిమానులు, ఆయన్ను కాపు నాయకుడిగా భావిస్తున్నఆ వర్గం ప్రజలు కూడా వైసీవైపే ఉంటారు. ఇందులో అనుమానం లేదు.

పవన్ సంగతేంటి..?

కాపుల్ని రాజకీయంగా ఎదగనీయకుండా చేసిన చంద్రబాబుతోటే పవన్ చేతులు కలపాలని ఉవ్విళ్లూరుతున్నారు. పదే పదే కమ్మల్ని భుజాన మోయాలని అనుకుంటున్నారు. జనసేన సింగిల్ గా బరిలో దిగితే.. తమ సత్తా ఏంటో చూపించాలని కాపు వర్గం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 

అంతెందుకు.. చంద్రబాబుతో ఆయన కలవకుండా ఉంటే.. నేరుగా పవన్ కి మద్దతిచ్చేందుకు చాలామంది కాపు నాయకులు సిద్ధంగా ఉన్నారు. కానీ అది జరగడం లేదు. పదే పదే చంద్రబాబుతో పొత్తు అంటూ కాపుల్ని మోసం చేస్తున్నారు పవన్.

ఎవరు గొప్ప..?

ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించి తనకంటూ సొంతగా ఓటు బ్యాంకు సృష్టించుకుని, ఎవరితో కలవకుండా సొంతగా పోటీ చేసి తాను గెలిచి, తనతో మరికొందర్ని గెలిపించుకున్న చిరంజీవి గొప్పా..? పొత్తుల కోసమే పార్టీ పెట్టి, వారినీ వీరినీ గెలిపించి చివరకు త్యాగాల పేరుతో సొంత పార్టీ కార్యకర్తలకు వెన్నుపోటు పొడుస్తున్న పవన్ కల్యాణ్ గొప్పా..? వీరిద్దరిలో ఎవరు తమ వర్గానికి అసలు నాయకుడో కాపులు తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది.

చిరంజీవిని వైసీపీ ఓన్ చేసుకుంటోంది, పవన్ ని చంద్రబాబు తన నీడలోకి తెచ్చుకుంటున్నారు. వీరిద్దరిలో కాపు వర్గం ఏవైపు నిలబడుతుందో చూడాలి.