జన సైనికులారా త్యాగాలకు సిద్ధం కండి..!

జనసేన కార్యకర్తల్ని పవన్ కల్యాణ్ ఎప్పుడూ జనసైనికులు అని ఎందుకు పిలుస్తుండాడో చాలామందికి అర్థమయ్యేది కాదు. జనసైనికులు దాన్ని పొగడ్తగా కూడా అనుకునేవారు. కానీ యుద్ధంలో ముందుగా బలయ్యేది సైనికుడే.  Advertisement ఆ ఉద్దేశంతోనే…

జనసేన కార్యకర్తల్ని పవన్ కల్యాణ్ ఎప్పుడూ జనసైనికులు అని ఎందుకు పిలుస్తుండాడో చాలామందికి అర్థమయ్యేది కాదు. జనసైనికులు దాన్ని పొగడ్తగా కూడా అనుకునేవారు. కానీ యుద్ధంలో ముందుగా బలయ్యేది సైనికుడే. 

ఆ ఉద్దేశంతోనే జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ జనసైనికులు అని నామకరణం చేసినట్టున్నాడు. ఈసారి కూడా సైనికులు మరోసారి త్యాగాలకు సిద్ధమైపోవాలని పవన్ పరోక్షంగా పిలుపునిచ్చారు. అంటే.. ఎన్నికల్లో పోటీపై ఆశలు పెట్టుకోవద్దని క్లారిటీగా చెప్పేశాడన్నమాట.

పొత్తు దాదాపు ఫిక్స్. దీంతో మరోసారి టీడీపీ చేతిలో జనసేన కీలుబొమ్మగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. 7 శాతం ఓట్ షేర్ తో పవన్ కల్యాణ్ డిమాండ్ చేసే పొజిషన్ లో లేరు. మధ్యలో బీజేపీ కూడా కలిసే అవకాశముంది కాబట్టి వాటాలేస్తే జనసేనకు మిగిలేవి ఎన్నిసీట్లో అర్థం చేసుకోవచ్చు. 

కాబట్టి ఈసారి జనసేన తరఫున టికెట్లు ఆశిస్తున్న చాలామంది ఆశలు వదులుకోవాల్సి రావొచ్చు. ఈ విషయాన్ని పరోక్షంగా పవన్ చెప్పకనే చెప్పారు.

జనసైనికుల భావన ఏంటి..?

చెప్పేస్తారు, పవన్ కల్యాణ్ చెప్పేస్తారు, భయం లేకుండా ప్రకటించేస్తారు.. వచ్చే ఎన్నికల్లో జనసేన 175 అసెంబ్లీ సీట్లకు పోటీ పడుతుందని అనేస్తారు అనుకుంటూ జనసైనికులు ఇప్పటం వెళ్లారు. కానీ అక్కడ జరిగింది వేరు. 175 కాదు కదా, కనీసం వన్ ప్లస్ సెవన్ ప్లస్ ఫైవ్.. నికరమైన 13 సీట్లు కూడా జనసేనకు వచ్చేలా లేవు. 

టీడీపీ, బీజేపీ వాటాలేసుకుంటే.. హోరాహోరీ పోరు జరిగే 13 సీట్లు కూడా జనసేనకు విదిల్చే ప్రసక్తే లేదు. మరి ఇంతకాలం జనసేన జెండా భుజాన మోసిన కార్యకర్తలు ఏంకావాలి. 

సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓటు వేసి చెవిలో పూలు పెట్టుకోవాలా..? రేపు నిజంగానా ఆ స్థానంలో ఆ పార్టీ గెలిస్తే.. ఎమ్మెల్యేలు సొంత పార్టీ కార్యకర్తలకు ప్రయారిటీ ఇస్తారా, జనసైనికుల్ని పక్కన కూర్చోబెట్టుకుంటారా..? అంటే తాము మద్దతిచ్చే పార్టీలోకి ముందే జంప్ కావడమే మేలు కదా.. అనుకుంటున్నారు కార్యకర్తలు, నేతలు.  

చావో రేవో సింగిల్ గానే..?

2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే ధైర్యం చేయలేదు పవన్ కల్యాణ్. సమయం సరిపోలేదని, అప్పటికే పొత్తు పెట్టుకున్న బీఎస్పీ, వామపక్షాలకు కొన్ని సీట్లు ఇచ్చేశారు. కానీ ఈసారి చేతిలో బోల్డంత టైమ్ ఉంది. 

టీడీపీపై జనాల్లో ఆశ లేదు, బీజేపీపై నమ్మకం లేదు. కనీసం ఈ టైమ్ లో అయినా పవన్ సింగిల్ గా పోటీ చేస్తే జనసేన సత్తా తెలిసిపోతుంది. అధికారంలోకి రాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా మారే ఛాన్స్ ఉంది. దీన్ని పవన్ కల్యాణ్ మిస్ చేసుకోవడం జనసైనికులకు ఏమాత్రం ఇష్టం లేదు.

వాడుకుని వదిలేస్తే..

నిజంగానే టీడీపీ, జనసేన, బీజేపీ కలసి అధికారంలోకి వస్తాయే అనుకుందాం. 2014లో ఏం జరిగింది..? పవన్ ని వాడుకుని వదిలేశారు బాబు. ఆ తర్వాత దిక్కూ మొక్కూ లేకుండా అయిపోయారు జనసైనికులు. పైగా పవన్ సీఎం అభ్యర్థి కూడా కాలేరు. 

ఈసారి కూడా చంద్రబాబు ఫుల్ గా పవన్ ను వాడుకొని వదిలేస్తారు. అయితే తను ముఖ్యమంత్రి అవుతారు లేదంటే లోకేష్ ను కూర్చోబెడతారు. అంతేతప్ప పవన్ కు ఆ ఛాన్స్ ఇవ్వరు.

ఇటు సీట్లు పోయి, అటు ఓట్లు పోయి, ఇంకోవైపు సీఎం సీటు దక్కక.. ఎటూకాని పార్టీ అవుతుంది జనసేన. ఇలా జనాలు రకరకాలుగా పవన్ స్పీచ్ ను విశ్లేషించుకుంటున్నారు.