పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో వైసీపీపై విజయం సాధించి తమ తడాఖా చూపుతామని జనసేన, టీడీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. అందులోనూ మంత్రి రంగనాథరాజు నియోజకవర్గంలోని జెడ్పీటీసీ స్థానం కావడంతో ప్రతిపక్షాలు సవాల్‌గా తీసుకున్నాయి. ఇదే సందర్భంలో వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిపక్షాలతో ఢీ అంటే ఢీ అన్నది. హోరాహోరీగా జరిగిన ఎన్నిక ఫలితం రానే వచ్చింది.
పెనుగొండ జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ తనకు తిరుగులేదని చాటి చెప్పింది. తన సమీప ప్రత్యర్థి, జనసేన అభ్యర్థి కలగా శ్రీలక్ష్మిపై వైసీపీ అభ్యర్థి పోడూరి గోవర్ధని 4,300 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ-జనసేన పొత్తు కుదుర్చు కున్నాయి. పొత్తలో భాగంగా జనసేన అభ్యర్థి కలగా శ్రీలక్ష్మి బరిలో నిలిచారు. వివిధ సామాజిక సమీకరణాల రీత్యా తామే గెలుస్తామని జనసేన, టీడీపీ కూటమి ధీమాగా చెబుతూ వచ్చింది.
టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుండడంతో సహజంగానే పెనుగొండ జెడ్పీటీసీ ఫలితం రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఇక్కడి జయాపజయాలు రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన పొత్తులపై ఆధారపడి వుంటుందనే చర్చకు దారి తీసింది. అయితే టీడీపీ, జనసేన పొత్తును జనం హర్షించలేదని పెనుగొండ జెడ్పీటీసీ ఫలితం తేల్చి చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పైగా పోటీ నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో వైసీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడం టీడీపీ, జనసేన శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి. జనసేనకు మాత్రం పెనగొండ జెడ్పీటీసీ స్థానంలో విజయం “కలగా”నే మిగిలిందని చెప్పొచ్చు.