మా నాన్న‌కు వివేకా హ‌త్య‌తో సంబంధం లేదు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి ఇటీవ‌ల ద‌స్త‌గిరి వాంగ్మూలం పెను దుమారం సృష్టిస్తోంది. నిందితుడు ద‌స్త‌గిరి వాంగ్మూలం ఆధారంగా క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అత్యంత స‌న్నిహితుడు, వైసీపీ రాష్ట్ర నాయకుడు…

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి ఇటీవ‌ల ద‌స్త‌గిరి వాంగ్మూలం పెను దుమారం సృష్టిస్తోంది. నిందితుడు ద‌స్త‌గిరి వాంగ్మూలం ఆధారంగా క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అత్యంత స‌న్నిహితుడు, వైసీపీ రాష్ట్ర నాయకుడు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డిని సీబీఐ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు.

ఈ ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో క‌ల‌క‌లం రేపుతోంది. దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ స‌భ్యులైన అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, చిన్నాన్న వైఎస్ మ‌నోహ‌ర్‌రెడ్డి పేర్ల‌ను కూడా ద‌స్త‌గిరి త‌న వాంగ్మూలంలో ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. వైఎస్ అవినాష్‌కు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతో …సీబీఐ త‌దుప‌రి తీసుకునే చ‌ర్య‌ల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది.

ఈ నేప‌థ్యంలో దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి అలియాస్ దొండ్ల‌వాగు శంక‌ర్‌రెడ్డి కుమారుడు చైత‌న్య‌రెడ్డి తాజాగా సీబీఐకి రాసిన లేఖ ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌న తండ్రికి వైఎస్ వివేకా హ‌త్య‌తో ఎలాంటి సంబంధం లేద‌ని ఆ యువ‌కుడు చెప్పుకొచ్చాడు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని చైత‌న్య‌రెడ్డి సీబీఐ అధికారుల‌ను కోర‌డం గ‌మ‌నార్హం. ఆ లేఖ‌లో ఏమున్న‌దంటే…

‘వివేకా హత్య కేసులో మా తండ్రికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆరోపణలతోనే మా నాన్నను అరెస్టు చేశారు. ఈ నెల 15న ఆయన ఎడమ భుజానికి సర్జరీ జరిగింది. ఇంకా వైద్యచికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్యంతో ఉన్నందున న్యాయం చేయాలని సీబీఐకి విజ్ఞప్తి’ అని చైతన్యరెడ్డి కోరారు. త‌న తండ్రి హ‌త్య‌తో శివ‌శంక‌ర్‌రెడ్డికి ప్ర‌మేయం ఉంద‌ని వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత హైకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

అలాగే వివేకా హ‌త్య వెనుక పెద్ద‌లైన వైఎస్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు శివ‌శంక‌ర్‌రెడ్డి ఉన్నార‌ని ఎర్ర‌గంగిరెడ్డి త‌న‌తో చెప్పిన‌ట్టు ద‌స్త‌గిరి నేర అంగీకార వాంగ్మూలంలో పేర్కొన‌డం తెలిసిందే. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో శివ‌శంక‌ర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయ‌డం, తాజాగా ఆయ‌న కుమారుడు లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.