మాజీ మంత్రి, ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు తుదిశ్వాస విడిచారు. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ పయనం సాగించిన ఆయన సోమవారం విశాఖ అపోలో మృతి చెందారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గజపతినగరం, సతివాడ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వరసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా నెగ్గినట్టుగా చరిత్ర చెబుతోంది. గజపతి నగరం నుంచి రెండు సార్లు, సతివాడ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారాయన. 2004లో చివరిసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గారు.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సాంబశివరాజు ఆ తర్వాత వైఎస్ జగన్ వైపు నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు అత్యంత క్రియాశీలకంగా పని చేశారు. వయసు భారం అప్పటికే ఉన్నా సాంబశివరాజు జగన్ తరఫున నిలిచారు. ఆయన రాజకీయ శిష్యులు కాంగ్రెస్ పార్టీలోనే ఉండినా, సాంబశివరాజు జగన్ కు మద్దతు ప్రకటించి నిలిచారు.
వయోభారంతో ఆయన క్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది.