ఈ జనాలకు అస్సలు బుద్ది లేదు

కరోనా అంటేనే ఒక అంటువ్యాధి. సమూహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గ్రూపుల్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటే ఇంకా మంచిది. అందుకే నిన్నంతా జనతా కర్ఫ్యూ పాటించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు…

కరోనా అంటేనే ఒక అంటువ్యాధి. సమూహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గ్రూపుల్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటే ఇంకా మంచిది. అందుకే నిన్నంతా జనతా కర్ఫ్యూ పాటించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశమంతా నిన్న సెల్ఫ్ క్వారంటైన్ పాటించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశం నిర్మానుష్యమైంది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది?

సెల్ఫ్ క్వారంటైన్ పూర్తయిన వెంటనే అదేదో పెద్ద విజయంలా దాన్ని సెలబ్రేట్ చేశారు కొంతమంది. వీధుల్లోకి వచ్చి ర్యాలీలు తీశారు. ఉత్సాహంగా నలుగురితో కలిసి చప్పట్లు కొట్టారు. హాయ్-ఫైవ్ ఇచ్చుకున్నారు. బైకులు, కార్లు తీసి రోడ్లపై పరుగులెత్తించారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో నిన్న సాయంత్రం చాలామంది బయటకొచ్చి సంబరాలు చేసుకున్నారు. ఉదయం నుంచి నిష్ఠగా చేసిన జనతా కర్ఫ్యూ ను గంగలో కలిపేశారు.

అసలు స్వీయ నిర్బంధం అంటేనే వేరే వ్యక్తితో దూరంగా ఉండడం. అదేదో ఒక రోజుతో అయిపోయేది కాదు. కనీసం కొన్ని రోజుల పాటు మనకు మనం స్వీయ నిర్బంధం విధించుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో తిరిగినప్పటికీ వీలైనంత ఎడం పాటించాలి. అప్పుడే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోగలం. ఈ స్ఫూర్తిని రగల్చడం కోసమే ఒక్క రోజు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఈ చిన్న లాజిక్ ను మిస్సయిన కొంతమంది జనాలు బయటకొచ్చి గుంపులుగా ఏర్పడి ర్యాలీలు తీసి సెల్ఫ్ క్వారంటైన్ స్ఫూర్తినే దెబ్బతీశారు. పైపెచ్చు కరోనా వ్యాపించడానికి మరింత ఆస్కారం కల్పించారు.

ఇదొక కోణమైతే, ఈ జనతా కర్ఫ్యూలో మరో కోణం ఉంది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని ప్రధాని పిలుపునిస్తే.. దాన్నే హాలిడే వెకేషన్ లా ఫీలయ్యారు చాలామంది జనం. ఊళ్లకు వెళ్లడానికి రైల్వే స్టేషన్లకు, బస్ స్టేషన్లకు బారులు తీరారు. రోజు కూలీ చేసుకునేవాడికి ఉపాధి దొరక్క సొంతూరు వెళ్లాడంటే అందులో అర్థముంది. చదువుకున్న వాళ్లు, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు సైతం జనతా కర్ఫ్యూను హాలిడే సీజన్ లా ఫీల్ అవ్వడం బాధాకరం.

ఎక్కడి వారు అక్కడే ఉండాలి. బయటకు రాకుండా స్వీయ నిర్బంధాన్ని పాటించాలనేది జనతా కర్ఫ్యూ ఉద్దేశం. దీన్ని చాలామంది పండగ శెలవులుగా భావించి ప్రయాణాలు చేశారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇకనైనా ఇలాంటి అత్యుత్సాహాలు మానేయాలి. ఎవరికి వారు స్వీయ నిర్భంధంలో ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారంటే విషయ తీవ్రతను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడీ కరోనా వైరస్ ను అరికట్టడం ప్రభుత్వం చేతుల్లో లేదు, ప్రజల చేతుల్లోనే ఉంది.

అయితే తమన్ లేదంటే దేవీశ్రీ.. అనుప్ కి ఏమైంది?