మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ అంటూ జగన్ చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు పూర్తి ఆనందం వ్యక్తంచేస్తున్నారు. తమ ప్రాంతానికి అసెంబ్లీ వస్తుందని కొందరు, తమ ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని మరికొందరు, తమ ప్రాంతానికి హైకోర్టు వస్తుందని ఇంకొందరు ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్లంతా కామన్ గా హర్షం వ్యక్తం చేసే అంశం వికేంద్రీకరణ. దీనికి ఓ కారణం ఉంది.
ఊహించని విధంగా జరిగిన రాష్ట్ర విభజనలో ఏపీ ప్రజలందరూ హైదరాబాద్ ను కోల్పోయారు. ఆ బాధ అందరిలో ఉంది. ఎంత వద్దనుకున్నా, హైదరాబాద్ అంటే ఏపీ ప్రజలకు ఇప్పుడు పరాయి రాజధాని. గత ప్రభుత్వాలన్నీ నిధుల్ని హైదరాబాద్ పైనే గుమ్మరించాయి. చివరికి రాష్ట్ర, కేంద్ర సంస్థలు కూడా హైదరాబాద్ లోనే. ఒక్కసారిగా రాష్ట్ర విభజన జరగడంతో పాటు రాజధానితో పాటు లక్షల కోట్ల ఉమ్మడి ఆస్తుల్ని కోల్పోయారు ఆంధ్రా ప్రజలు.
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు, కలల రాజధానిని నిర్మిస్తానన్నారు. అమరావతిని స్వర్గసీమ చేస్తానన్నారు. సరిగ్గా ఇక్కడే చాలాప్రాంత వాసులు తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పునే మరోసారి చంద్రబాబు రిపీట్ చేస్తున్నారని భగ్గుమన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. తను చేసిన పాపానికి మూల్యం చెల్లించుకున్నారు చంద్రబాబు. ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రాజధాని.
చంద్రబాబు చేసిన తప్పును జగన్ చేయదలుచుకోలేదు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల్ని ఏర్పాటుచేశారు. నిజానికి పేరుకు 3 రాజధానులు అని చెప్పుకున్నప్పటికీ, ఆన్-లైన్ ద్వారా పనులు జరుగుతున్న ఈ రోజుల్లో అదేమంత సమస్య కాదు, రాష్ట్రానికి ఆర్థిక భారం కూడా కాబోదు. ఎటొచ్చి ప్రభుత్వం ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి, ఆర్థిక-సామాజిక అసమానతలు కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జగన్ చేస్తోంది కూడా అదే.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అందరంటే ఎక్కువగా సీఎం జగన్ కే తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రజలపై అదనపు భారం పడకుండా రాజధానుల్ని ఎలా ఏర్పాటుచేయాలో కూడా ఇప్పటికే జగన్ వద్ద ప్రణాళిక ఉండే ఉంటుంది. జగన్ ఏదీ ఊరికే మాట్లాడరనే విషయం తెలిసిందే. గడిచిన 6 నెలల్లో చేస్తున్న పనులు, ప్రవేశపెడుతున్న పథకాలు చూస్తే.. తెరవెనక ఆయన ఎంత కసరత్తు చేస్తున్నారనే విషయం అర్థమౌతూనే ఉంది. 3 రాజధానుల ప్రకటన వెనక కూడా అలాంటి భారీ కసరత్తే చేసి ఉంటారనేది నిస్సందేహం.
ఇవన్నీ పక్కనపెడితే.. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు సాగించిన రియల్ ఎస్టేట్ దందా గురించి నిన్ననే అందరికీ తెలిసొచ్చింది. ఏకంగా అసెంబ్లీ వేదికగా బుగ్గన, బాబు బండారాన్ని బయటపెట్టారు. టీడీపీ నేతలు, బంధువులు, మద్దతుదారులకు అమరావతిలో ఎన్ని ఎకరాలున్నాయో.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ లెక్కలతో చూపించారు. మొన్నటివరకు ఇవన్నీ బహిరంగ రహస్యాలే. ఇప్పుడు అధికారికంగా బయటపడ్డాయంతే. ఇంత జరిగిన తర్వాత జగన్ మళ్లీ అమరావతినే అభివృద్ధి చేయాలని భావిస్తే, ప్రజల దృష్టిలో అది క్షమించరాని నేరం అవుతుంది. అందుకే జగన్ ఆ తప్పు చేయదలుచుకోలేదు.
సో.. చంద్రబాబు ఎన్ని అరుపులు అరిచినా, పవన్ కల్యాణ్ ఎన్ని ట్వీట్లు పెట్టినా.. జగన్ మాత్రం ప్రజల మనసుల్లో ఉన్నదే ఆచరణలోకి తీసుకొచ్చారు. అందుకే జగన్ ఆలోచనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమ ప్రాంతం కూడా రాజధాని స్థాయిలో అభివృద్ధి చెందుతుందని, సంబర పడుతున్నారు.