మూడు పెళ్లిళ్లు ఓకే.. మూడు రాజధానులు వద్దు

అసెంబ్లీ సమావేశాల చివరి రోజు వ్యూహాత్మకంగా రాజధానిపై సీఎం జగన్ చేసిన ప్రకటనకు అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. చంద్రబాబు ఎలాగోలా యూ-టర్న్ తీసుకుని మాట మార్చేసుకుంటారు,…

అసెంబ్లీ సమావేశాల చివరి రోజు వ్యూహాత్మకంగా రాజధానిపై సీఎం జగన్ చేసిన ప్రకటనకు అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. చంద్రబాబు ఎలాగోలా యూ-టర్న్ తీసుకుని మాట మార్చేసుకుంటారు, కానీ పవన్ అలా కాదు కదా, తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అంటూ వితండవాదం చేస్తూనే ఉంటారు.

ఆవేశంగా అందరికంటే ముందే నోరుజారి పవన్ అటు రాయలసీమలో, ఇటు ఉత్తరాంధ్రలో తన ఇమేజి పూర్తిగా డ్యామేజీ చేసుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత పవన్ వరుసగా వేసిన ట్వీట్లు ఆయన అజ్ఞానాన్ని బైటపెట్టడమే కాదు… అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర వాసుల ఆగ్రహానికి కూడా కారణం అయ్యాయి. రాయలసీమ వెనకపడి ఉంది, ఉత్తరాంధ్ర నాయకుల నిరాదరణకు గురైంది అంటూ పెడబొబ్బలు పెట్టి యాత్రలు చేసిన పవన్ కల్యాణ్ కి ఆయా ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటైతే ఆటోమేటిగ్గా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే విషయం తెలియదా?

స్థానికంగా యవతకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, రవాణా, పరిశ్రమలు.. ఇలా అన్ని సౌకర్యాలు పెరుగుతాయి, సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అవుతుంది. ఈమాత్రం లాజిక్ తెలియకుండా కేవలం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి అనే ఒకే ఒక్క ప్రధాన అజెండాతో పవన్ కల్యాణ్ నోరు తెరిచారు. అర్థరాత్రి వరకు ట్వీట్లు పెడుతూనే ఉన్నారు, విషం చిమ్ముతూనే ఉన్నారు.

అయితే ఈ క్రమంలో తనకు తెలియకుండానే ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులపై కూడా విషం చిమ్ముతున్నాననే విషయాన్ని జనసేనాని మర్చిపోయారు. ఉత్తరాంధ్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, తన సినిమాల్లో ఉత్తరాంధ్ర పాటలు-యాస పెట్టానని స్వయంగా ప్రకటించుకున్న పవన్ కల్యాణ్, ఇప్పుడు అదే నోటితో ఉత్తరాంధ్రలో రాజధాని అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధిని కూడా వ్యతిరేకించినట్టే అనే లాజిక్ మిస్సయ్యారు. అందుకే పవన్ పై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.

అటు రాయలసీమవాసులు, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు ట్వీట్లతోనే పవన్ పై చెలరేగిపోతున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో చంద్రబాబు కంటే, పవన్ వ్యాఖ్యలనే చాలామంది తప్పుపడుతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు కానీ, మూడు రాజధాని నగరాలు ఉంటే తప్పా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మొత్తమ్మీద పవన్ కల్యాణ్ తొందరపడి నోరు తెరిచి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అంతేకాదు, ఈసారి పవన్ కు మరింత మంది జనసైనికులు దూరం కావడం ఖాయం. మరీముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పవన్ అభిమానులంతా అతడికి ఎదురుతిరగడం గ్యారెంటీ.