అయినా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి లేని ఇబ్బంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎందుకో అర్థం కావడం లేదు. జగన్ రాష్ట్రానికి మూడు వ్యవస్థలకు గాను మూడు రాజధానులను ప్రతిపాదించిన తీరు పట్ల సర్వత్రా అభినందనలే వ్వక్తం అవుతున్నాయి. విపక్షాలు ఇలాంటి ఆలోచన పట్ల యాగీ చేయాలని అనుకోవడం సహజమే. కాపోతే.. జగన్ రెండు నగరాలకూ తిరుగుతూ ఉంటాడా? అని చంద్రబాబునాయుడు ఎందుకు దుఃఖిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన తిరగాల్సి వస్తే బాబుకు బాధేంటి?
కొత్త రాష్ట్రానికి అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా.. కనీసం సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదు. రాష్ట్రంమీద ఆయనకున్న శ్రద్ధ అది. అదే జగన్మోహన రెడ్డి.. అమరావతిలోనే సొంత ఇల్లు కట్టుకున్నారు. అక్కడే ఇప్పుడు కూడా ఉంటున్నారు. అమరావతిలో సొంత ఇళ్లు ఉండగా.. కార్యనిర్వాహక రాజధాని అయిన విశాఖకు తిరగాల్సి జగన్ ఇబ్బంది పడాలి గానీ.. అద్దె యింట్లో బతికే చంద్రబాబుకు నొప్పెందుకు?
ప్రభుత్వం ఏం చేసినా సరే.. ఏదో ఒకటి అనాలి గనుక.. అనేద్దాం అనే ధోరణి రాజకీయాల్లో ఎప్పుడూ మంచిది కాదు. ఆ పార్టీలకే చేటు జరుగుతుంది. ప్రజలు ఆమోదించిన ప్రభుత్వ నిర్ణయాలను ఆడిపోసుకుంటే.. పార్టీలు ఇమేజి కోల్పోతాయి. విమర్శించే విపక్ష నాయకులని ప్రజలకు మంచి జరుగుతోంటే సహించలేకపోతున్నారని నలుగురూ అనుకునే ప్రమాదం ఉంది.
రాజధాని ప్రాంతాల్లో సొంత ఇల్లంటూ లేని చంద్రబాబు అమరావతిలో అద్దె ఇల్లు బదులుగా, విశాఖలో ఓ అద్దె ఇల్లు తీసుకుంటే సరిపోతుంది కదా.. అనేది ప్రజల మాట. సొంత ఇళ్లు ఉన్న నాయకులే.. ప్రజల బాగుకోసం, రాష్ట్ర సమీకృత అభివృద్ధి కోసం వికేంద్రీకరణ వంటి నిర్ణయాలు చేస్తోంటే.. ఏమీ లేని చంద్రబాబు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.