లాక్ డౌన్. ఈ పేరు వింటేనే ప్రజల గుండెల్లో వణుకు. ఓసారి లాక్ డౌన్ తో పడ్డ అష్టకష్టాలు చాలురా బాబూ అనుకుంటున్నారు. ఆకలితో అలమటించినవారు కొందరు, వేల కిలోమీటర్ల ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయినవారు కొందరు. అయినవారి ఆఖరి చూపుకి కూడా నోచుకోక అల్లాడినవారు మరికొందరు.
అప్పటివరకు ఎవ్వరూ చవిచూడని ఈ కొత్త అనుభవం వల్ల ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో, ప్రభుత్వాలు అంత చెడ్డపేరు మూటగట్టుకున్నాయి. కావాలనే తమని ఇబ్బందులపాలుజేస్తున్నారంటూ ప్రభుత్వాలపై మండిపడ్డారు ప్రజలు. ఆంక్షలతో కుదరదు అనుకున్న సందర్భంలోనే.. విడతలవారీగా అన్నిటికీ కేంద్రం గేట్లు ఎత్తేసింది.
ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మొదలైన దశలో దేశవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి. మరోసారి లాక్ డౌన్ తప్పదు అనే పరిస్థితి వచ్చేసింది. వాస్తవంగా ఈ మోస్తరు కేసులకే గతంలో లాక్ డౌన్ పెట్టేశారు. షాపులన్నీ మూతబడ్డాయి, జనసంచారం కనుమరుగైంది. వీధుల్లోకి వస్తే లాఠీలతో నాలుగు తగిలించేవారు. కానీ ఇప్పుడు కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అంటేనే భయపడుతున్నాయి.
లాక్ డౌన్ వల్ల వచ్చిన లాభం కంటే.. ఆర్థికంగా, సామాజికంగా జరిగిన నష్టమే ఇప్పటికీ పూడ్చుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు. అందుకే ఈసారి లాక్ డౌన్ ఉండదు అని ముందుగానే ప్రకటనలు చేస్తున్నారు.
కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు మూసేయడంతో విడతల వారీగా లాక్ డౌన్ తీసుకొస్తారని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొంతమంది ఆల్రడీ సొంతూళ్లకు పెట్టేబేడా సర్దేసుకుంటున్న సందర్భం. అయితే కేసీఆర్ మాత్రం లాక్ డౌన్ పెట్టే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య తగ్గకపోగా, ప్రజలకు అనవసర కష్టాలు, ప్రభుత్వానికి తలనొప్పులు వస్తాయనేది ఆయన ఆలోచన. ఇటు ఏపీ సీఎం జగన్ కూడా ఈ వ్యవహారంపై అసలు స్పందించలేదు. కేసుల సంఖ్య పెరిగే సందర్భంలో.. ఒంటిపూట స్కూళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనధికారికంగా ఆంక్షలు పెడుతున్నారే కానీ, లాక్ డౌన్ అనడానికి సంశయిస్తున్నారు.
అటు కేంద్రం కూడా లాక్ డౌన్ పెట్టడానికి భయపడుతోంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగబోతున్న వేళ, లాక్ డౌన్ అంటే.. అన్నీ తలకిందులవుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశం అయిన ప్రధాని మోదీ.. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు. సామాజిక దూరం, మాస్క్ లు ధరించడం.. వంటివి తిరిగి అలవాటు చేసుకోవాలని ఆ దిశగా నూతన మార్గదర్శకాలు చేశారు.
మొత్తమ్మీద లాక్ డౌన్ అంటే ప్రజల కంటే ప్రభుత్వాలే ఎక్కువ భయపడుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఒకటి మాత్రం నిజం. ఈసారి సెకెండ్ వేవ్ ను అడ్డుకునే బాధ్యత పూర్తిగా ప్రజలదే. ప్రభుత్వాలు మార్గదర్శకాలు, సలహాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితమయ్యాయి.