ఒకవైపు జనాలు కరోనా గురించి భయపడుతున్నారు. చైనా గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కరోనాతో ప్రజల ఆర్థిక శక్తి బలహీన పడిన వైనం గురించి వేరే చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు, మధ్యతరగతి కుటుంబాలే కరోనా లాక్ డౌన్ పరిణామాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేశంలో ఉన్న ఈ పరిస్థితి గురించి మోడీ ప్రభుత్వం ఎంత వరకూ ఆలోచిస్తుందో అర్థం అవుతూనే ఉంది. లాక్ డౌన్ తో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే..తమకేం సంబంధం అన్నట్టుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైనం గురించి ఎంత చెప్పినా తక్కువ. మూడు నెలలుగా కొన్ని కోట్ల మందికి ఉపాధి కూడా లేకుండా పోతే.. కష్టపడి పనిచేసుకునే వాళ్లకు పని కూడా దొరక్కుండా పోతే.. వాళ్ల కోసమంటూ చిన్నపాటి ఆర్థిక సాయం కూడా చేయని నిర్ధయ సర్కారుగా మోడీ ప్రభుత్వం నిలుస్తూ ఉంది.
పెద్ద పెద్ద ఆర్థిక వేత్తలు, మేధావులు.. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, అది పెరిగితే ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుంది, దీని కోసం ప్రభుత్వం చొర చూపాలి, వీలైతే ప్రజల ఖాతాల్లోకే డబ్బులు వేయండని మొత్తుకుంటున్నారు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలకు ప్రత్యక్షంగా డబ్బు సర్దుబాటు చేస్తూ ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వం మాత్రం అలాంటివన్నీ అడగొద్దు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. లాక్ డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చినా.. ఇంకా అనేక రంగాల్లోని కార్మికులకు పని దొరికే పరిస్థితి లేదు! అయినా కేంద్రం మాత్రం తమకేమాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది.
అదలా ఉంటే… ప్రజలకు ఈ సమయంలో సాయం చేయడం ఏమో కానీ, ప్రజల నుంచినే వీలైనంత దండుకుంటోంది కేంద్ర ప్రభుత్వం! ఎంతలా అంటే…వరసగా 18వ రోజు కూడా పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగాయి! జూన్ ఏడో తేదీ నుంచి పెరుగుతూనే ఉన్న ఈ ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి! అంతర్జాయంగా బ్యారెల్ క్రూడ్ ధర 20 డాలర్లకు పడిపోయింది! అయితే మోడీ ప్రభుత్వం మాత్రం పెంపుదలలో రికార్డులు సృష్టిస్టోంది. 18 రోజుల్లో పెట్రోల్ మీద లీటర్ కు 8.5 రూపాయలు, డీజిల్ ధర లీటర్ కు 10.5 రూపాయలు పెంచారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు!
ప్రజలే తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే.. వాళ్ల కొనుగోలు శక్తి నశిస్తూ ఉంటే.. వాళ్లు తప్పనిసరిగా కొంటారనే పెట్రోల్-డీజిల్ ధరలను ఈ స్థాయిలో పెంచేసి పన్నులు పిండుకోవడం ద్వారా మోడీ ప్రభుత్వం ఏం సందేశం ఇస్తోందో వేరే చెప్పనక్కర్లేదు! స్థూలంగా ఈ పిండటం ఇలాగే కొనసాగితే…ఇండియాలో పెట్రోల్ లీటర్ కు వంద రూపాయలు చేరే రోజు మరెంతో దూరం లేదు.. బహుశా ఇంకో ఇరవై రోజుల్లోనే ఆ ఫీట్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా పెట్రో ధరలు నేల చూపుల దశలో ఉన్నప్పుడు ఇండియాలో ఆల్ టైమ్ హై ధరలకు చేర్చేలా ఉన్నారు నరేంద్రమోడీ!