గల్ఫ్ పరిస్థితులు సానుకూలంగా ఉన్న సమయంలోనే మోడీ సర్కారు పెట్రోల్ ధరలను దేశ వ్యాప్తంగా 80 రూపాయలకు చేరువ చేసింది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పెట్రో ధరలు మండబోతున్నాయని వార్తలు వస్తుస్తున్నాయి. దీంతో ఇండియాలో పెట్రోల్ ధరలు పతాక స్థాయికి చేరబోతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇప్పటికే ప్రధాన నగరాల్లో బ్రాండెడ్ పేరుతో కొన్ని పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ను 90 రూపాయలకు అమ్ముతున్నారు! ఇలాంటి నేపథ్యంలో… ఇప్పుడు ధరలు పెరిగితే.. లీటర్ పెట్రోల్ ధర మూడంకెల సంఖ్యకు చేరడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. దేశంలో లీటర్ పెట్రోల్ ధర మూడంకెలకు చేరడం మోడీ మహాశయుడి ఆధ్వర్యంలోనే సాధ్యం అవుతున్నట్టుగా ఉంది.
వెనుకటికి మన్మోహన్ హయాంలో లీటర్ పెట్రోల్ ధర 50 రూపాయలకు చేరితేనే.. మోడీ తెగ ఫీల్ అయ్యారు. అప్పట్లో కేంద్రాన్ని తీవ్రంగా విమర్శిస్తూ మోడీ ట్వీట్లేశారు. పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని, ప్రజలను ఇబ్బంది పెడుతోందంటూ అప్పట్లో మోడీ తీవ్రంగా విమర్శించారు. అదంతా పెట్రోల్ ధర 50 రూపాయలకు చేరినందుకే! ఆరేళ్లు గడిచే సరికి ఇప్పుడు అదే లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరువ అయ్యింది. ఇది మాత్రం మోడీ ఫెయిల్యూర్ కాదు, ఇదంతా దేశభక్తే నండోయ్!