దేశ వ్యాప్తంగా ఫోన్ హ్యాకింగ్ కుదిపేస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ఫోన్లు హ్యాక్‌కు గురై ఉంటాయనే ఆందోళనలో ఉన్నారు. తమ వ్యక్తిగత గోప్యతకు భద్రత లేకపోవడంపై పలువురు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు తదితరులు తీవ్ర కలత చెందుతున్నారు.
తాజాగా తెలుగు సమాజానికి చిరపరిచితుడైన హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఫోన్ కూడా హ్యాక్‌కు గురైనట్టు వార్తలు రావడం…రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
ఇజ్రాయెల్ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌వో రూపొందించిన పెగాసస్ స్పైవేర్ బాధితుల పేర్లు రోజురోజుకు కొత్తకొత్తవి తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు.. ఎల్గార్ పరిషత్ కేసులో నిందితులు, వారి కుటుంబ సభ్యులు, వారి తరఫున వాదిస్తున్న న్యాయవాదుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండడం గమనార్హం. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ, అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఏడీఏజీ) కీలక అధికారి పేరు కూడా లిస్టులో ఉండడం దుమారం రేపుతోంది.
పెగాసస్ ఉదంతం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. దీనిపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. అందుకు కేంద్రం ససేమిరా అనడంతో విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు సభ్యుల ఆందోళనతో స్తంభించాయి. ఇదిలా ఉండగా కేంద్రం తమపైనా నిఘా ఉంచి ఉండొచ్చని రైతు సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌వద్ద 200 మంది రైతులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది అనైతిక ప్రభుత్వమని, పెగాసస్‌తో నిఘా పెట్టిన ఫోన్ నంబర్ల జాబితాలో తమ నెంబర్లు కూడా ఉంటాయన్న అనుమానం వస్తోందని రైతు నేత శివకుమార్ కక్కా అన్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ హరగోపాల్ పేరు తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రము ఖులు ఉలిక్కిపడుతున్నారు. తమ ఫోన్లు కూడా హ్యాక్‌కు గురై ఉంటాయని రాజకీయ నేతలు అంతర్గత చర్చల్లో ప్రస్తావిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా చివరికి అనుమానం ఉంటే సొంత పార్టీ నేతల ఫోన్లపై కూడా మోడీ సర్కార్ నిఘా ఉంచిన ఆశ్చర్యపోనవసరం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే మోడీ సర్కార్ అంటే భయం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు బహిరంగంగా ఏమీ మాట్లాడలేని దయనీయ స్థితి.
పొరుగునే ఉన్న కర్నాటకలో దాదాపు రాజకీయ ప్రముఖులందరి ఫోన్లపై నిఘా ఉంచిన విషయం వెలుగు చూసింది. అలాంటప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రత్యర్థులను విడిచి పెడతారని భావించలేం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా పెగాసస్ ఉదంతం పైకి కనిపించే దానికంటే అంతర్గత భయాందోళన ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు.