ఫోన్ ట్యాపింగ్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదులు ఘాటుగా మాట్లాడారు. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది సుమన్ బలమైన వాదనలు వినిపించినట్టు సమాచారం.
ఈ పిల్‌ను చూస్తే ఏదో చిన్నపిల్లల వ్యవహారంలా ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు తీవ్ర వ్యాఖ్య చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టు జడ్జి మీడియాతో మాట్లాడినట్టు కథనం ప్రచురించారని, తమకు తెలిసినంత వరకూ హైకోర్టు జడ్జి ఎవరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ మీడియా సంస్థతో మాట్లాడలేదని నమ్ముతన్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఈ కథనం చట్ట ధిక్కరణకు వస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు.
ఇప్పటికే ఈ కథనంపై ప్రభుత్వం పరువు నష్టం నోటీసు ఇచ్చినట్టు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కథనాన్ని ప్రచురించిన మీడియా సంస్థను కూడా పార్టీని చేయాలని కోర్టుకు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ట్యాపింగ్‌పై సమాచారం వారికి ఎక్కడ నుంచి వచ్చింది? ఈ కథనాన్ని ఎలా రాశారు? వారితో జడ్జి మాట్లాడి ఉంటే ఏం చెప్పారో ఈ కోర్టుకు చెప్పాలని వాదనలు వినిపించారు.
కాగా ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశిస్తే ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న దానికి ఆధారాలు ఉన్నాయా? అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈనెల 20 కి వాయిదా వేసింది.