ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని జాయిన్ చేస్తే ఎల్ కేజీ నుంచి పాఠాలు మొదలుపెడతారు. యూకేజీలోనే అన్నీ చెప్పేస్తారు. ఒకటో తరగతికి వచ్చేసరికి ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందనేది సగటు తల్లితండ్రుల ఆలోచన.. అలాంటప్పుడు ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తే ఉపయోగం ఏంటనేది వాళ్ల ప్రశ్న. అందుకే ఇంగ్లిష్ మీడియం విధానం ప్రవేశపెట్టినా కొంతమంది ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపే అవకాశం ఉండదనేది ఓ విశ్లేషణ. సరిగ్గా ఇక్కడే ముఖ్యమంత్రి జగన్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కేజీ విద్యను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదు కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా అంగన్ వాడీ కేంద్రాల్ని వాడుకోవాలని అనుకుంటున్నారు.
అవును.. ఇకపై అంగన్ వాడీ కేంద్రాలన్నీ ప్రీ-ప్రైమరీ స్కూల్స్ గా మారబోతున్నాయి. ఈ మేరకు మహిళా-శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అంగన్ వాడీ కేంద్రాల్ని ప్రీ-ప్రైమరీ స్కూళ్లుగా మార్చే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అంగన్ వాడీల్లో ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కోసం 4వేల కోట్ల రూపాయలు కేటాయించబోతున్నారు ముఖ్యమంత్రి.
ముందుగా నాడు-నేడులో భాగంగా అంగన్ వాడీల రూపురేఖలు మార్చబోతున్నారు. ఈ క్రమంలో ప్రీ-ప్రైమరీ స్కూళ్లకు కావాల్సిన హంగులన్నీ సమకూరుస్తారు. మరోవైపు దీనికి సమాంతరంగా అంగన్ వాడీ వర్కర్లకు ఏడాది పాటు డిప్లమా కోర్స్ కింద ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రీ-ప్రైమరీలో సిలబస్ ఎలా ఉండాలనే అంశంపై విద్యాశాఖ త్వరలోనే కసరత్తు చేయబోతోంది.
ఓవరాల్ గా చూసుకుంటే అంగన్ వాడీల్లో చేరిన పిల్లలు ఒకటో తరగతి కోసం పాఠశాలలో అడుగుపెట్టే సమయానికి పూర్తిస్థాయిలో మానసికంగా-శారీరకంగా సిద్ధమౌతారు. పనిలోపనిగా ఇంగ్లిష్-తెలుగు పాటలు, అక్షరాలు కూడా నేర్చుకొని రెడీగా ఉంటారు. ఇదీ జగన్ విద్యాప్రణాళిక. అయితే ప్రైవేటు పాఠశాలల తరహాలో విద్యార్థులను రాచి రంపాన పెట్టే సంస్కృతిని మాత్రం ప్రోత్సహించేది లేదంటున్నారు ముఖ్యమంత్రి.
అమ్మఒడి, నాడు-నేడు పథకాల ద్వారా గుణాత్మక మార్పులు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి.. అంగన్ వాడీల విషయంలో కూడా సక్సెస్ అయితే.. ఏపీ విద్యావ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయి. అప్పుడిక ప్రైవేట్ స్కూళ్లకు పూర్తిస్థాయిలో చెక్ పడినట్టే.