ఈఎస్ఐ స్కామ్ లో ప్రమేయం ఉందనే ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, తెలుగుదేశం నేత పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ ను ఏసీబీ అధికారులు గాలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. ఇటీవలే పితాని వెంకట సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తనను అరెస్టు చేస్తారనే భయంతోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం. ఆయనతో పాటు అప్పట్లో పితానికి పీఎస్ గా చేసిన మురళీ మోహన్ అనే అధికారి కూడా ముందస్తు బెయిల్ కు పిటిషన్ పెట్టుకున్నాడు. వీరిద్దరి పిటిషన్లనూ కోర్టు తిరస్కరించింది.
ఇప్పటికే ఏసీబీ అధికారులు మురళీమోహన్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో తదుపరి అరెస్టు పితాని వెంకట సురేష్ దే అనే టాక్ వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన కోసం పశ్చిమగోదావరి, విశాఖ, హైదరాబాద్ ల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.
తమ అరెస్టులు అక్రమాలు అని అంటూనే..అరెస్టుకు ముందు మాత్రం పరారీ కావడం తెలుగుదేశం నేతలకు అలవాటుగా మారింది. హత్య కేసులో అరెస్టైన కొల్లు రవీంద్ర కూడా పరారీలో ఉండగా దొరికారు. ఆ హత్యతో ఆయనకు సంబంధం లేదని కుట్రతో ఇరికించారని టీడీపీ నేతలు అంటున్నారు. సంబంధం లేనప్పుడు ఆయన గోడ దూకి ఎందుకు పరారీ అయ్యారనే ప్రశ్నకు తెలుగుదేశం సమాధానం చెప్పలేదు. అదేమంటే ఆయన బీసీ అంటారు. చంపబడ్డ వ్యక్తి కూడా బీసీనే మరి! దానికీ సమాధానం లేదు.
ఇక ఇప్పుడు పితాని వెంకట సురేష్ వంతు. పితాని క్యాస్ట్ ఏమిటో మరి..ఇది కూడా ఆ కులం పై దాడి అని చంద్రబాబు నాయుడు కుల రొచ్చు రేపుతారేమో. పితాని సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ స్కామ్ కొనసాగిన తీరుపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసిందట!