ఇంతకీ జనసేన అధిపతి పవన్ కల్యాణ్ అక్కసు తీరెదెలా? ఆయన అసహనం హద్దుల్లేని రీతిల్లో చెలరేగిపోతూ ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో పవన్ కల్యాణ్ అక్కసు పతాక స్థాయిలోనే కొనసాగుతూ ఉంది. ఇది ఆఖరికి అభిమానులకు కూడా అంతుబట్టని రీతిలో సాగిపోతూ ఉంది.
'జగన్ మోహన్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అవుతాడో చూస్తా? జగన్ ముఖ్యమంత్రి కాడు. ఇది శాసనం..' అంటూ పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు మాట్లాడారు. అయితే పవన్ కల్యాణ్ శాసనపు పలుకులను ఏపీ ప్రజలు పిచ్చకామెడీగా తీసుకున్నారు. జగన్ ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు.
అసలే సినిమా వాడు. తెరపై హీరో. కాబట్టి తన మాటలు మరీ కామెడీ అయిపోయే సరికి పవన్ కల్యాణ్ కు అసహనం పతాక స్థాయికి చేరినట్టుగా ఉంది. ఆరు నెలలు అయినా పవన్ కల్యాణ్ అక్కసు ఏ మాత్రం తీరినట్టుగా కనిపించడం లేదు. అందుకు నిదర్శనం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇంకా పవన్ కల్యాన్ 'వైసీపీ లీడర్' అంటూ సంబోధిస్తూ ఉండటం.
తన ట్వీట్లలో పవన్ కల్యాణ్ ఇదే తీరును కొనసాగిస్తూ ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ జగన్ పేరుకు ముందు ముఖ్యమంత్రి అని సంబోధించినా, సంబోధించకపోయినా ఎవరికీ నష్టం ఏమీ లేదు. ఎటొచ్చీ కేసీఆర్ ను గౌరనీయమైన తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ, చంద్రబాబును గౌరవనీయులైనా ఏపీ మాజీ ముఖ్యమంత్రి అంటూ.. జగన్ ను మాత్రం వైసీపీ లీడర్ అంటూ సంబోధించి పవన్ కల్యాణే తన అక్కసు, తన అసహనం, తన లేకితనాన్ని చాటుకుంటూ ఉన్నాడు.
అయితే ఇలాంటి లేకి రాజకీయాలతో తను సాధించేది శూన్యమని పవన్ కల్యాణ్ ఇప్పటికీ గ్రహించలేకపోతుండటమే అసలైన కామెడీ. ఎన్నికల ముందు 'జగన్ ను ముఖ్యమంత్రిని కానివ్వను' అంటూ ప్రకటించి, పవన్ కల్యాణ్ తను ఎమ్మెల్యే కాలేకపోయారు! ఇది సినిమా కాదు, అని పవన్ గ్రహించలేకపోయారు. అప్పుడు గ్రహించలేకపోతే గ్రహించకలేకపోయారు.. ఇప్పటికీ పవన్ కథ అలానే ఉంది.
అప్పుడు జగన్ మీద అక్కసు వెల్లగక్కినట్టుగానే, ఇప్పుడు కూడా జగన్ మాటలకు పెడార్థాలు తీస్తూ.. పవన్ కల్యాణ్ అంతే లేకిగా, అక్కసుతో వ్యవహరిస్తూ ఉన్నారు. తన తీరుతో ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన పవన్ కల్యాణ్, భవిష్యత్తులో కూడా ఆ అవకాశాలను లేకుండా చేసుకునే దిశగా సాగుతున్నారని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.