ఎన్నికలు అయిపోయి ఇంకా ఐదు నెలలే అయ్యాయి. ప్రజలు ఐదేళ్ల పదవీకాలంలో ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు! అయితే ఓడిపోయిన వాళ్లు మాత్రం అదిగో ఎన్నికలు, ఇవిగో ఎన్నికలు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఐదునెలల కిందటి ఎన్నికల్లో వీళ్లు పొడిచింది ఏమీలేదు! ఒకటికి రెండుచోట్ల పోటీచేసి చిత్తు అయ్యారు. అనేక పార్టీలను కలుపుకుని వెళ్లి కూటమిని ఏర్పరిచి చిత్తు అయ్యారు! అయితే ఇంతలోనే ఎన్నికలు.. ఎన్నికలు.. అంటూ వీరు కామెడీ చేసేస్తూ ఉన్నారు.
ఇది మరెవరి విషయంలోనో కాదు.. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ విషయంలోనే. ప్రభుత్వం ఐదేళ్లు ఉండదని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. మూడేళ్లకే ఎన్నికలు వస్తాయని చిలక జోస్యం చెబుతున్నారు. ఆఖరికి బీజేపీ వాళ్లు కూడా ధైర్యంగా ఈ మాటలు చెప్పడంలేదు. మహారాష్ట్ర, హర్యానాల్లో తగిలిన మొట్టికాయలతో భారతీయ జనతా పార్టీ కూడా ముందస్తు మీద కసరత్తు ఆపుతున్నట్టే. ముందస్తు అంటూ అతి విశ్వాసంతో వెళితే మొదటికే మోసం వస్తుందని బీజేపీకి కూడా భయాలు లేకపోలేదు.
తమపాలన మీద అతి నమ్మకంతో ముందస్తుకు వెళ్లి బోల్తాపడ్డవాళ్లు చాలా మందే ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అదే బాపతే. అందులోనూ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ఒకేసారి అంటూ దేశమంతటినీ ఒకేసారి ఎన్నికలకు తీసుకెళ్తే ఆ తర్వాత ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. రాష్ట్రాల వారీగా బీజేపీపై వ్యతిరేకత ఉంది. అదే వ్యతిరేకత మోడీ మీద కూడా అదే సందర్భంలో మళ్లితే అంతే సంగతులు!
మోడీ మీద అనుకూలత రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించడం మాట అటుంచి, రాష్ట్రాల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకత మోడీనే ముంచదని గ్యారెంటీలేదు. అందుకే కొన్నాళ్లుగా జమిలి ఎన్నికల ప్రస్తావనను బీజేపీ పక్కన పెడుతూ వస్తోంది. ఇక మహారాష్ట్ర, హర్యానా ఫలితాలను గమనించాకా.. బీజేపీ తన అతి విశ్వాసాన్ని తగ్గించుకోవచ్చు.
అడపాదడపా రాజకీయాలను పరిశీలించే పవన్ కల్యాణ్ కు ఇలాంటి అర్థంకాకపోవచ్చు. అన్నింటికి మించి.. ఐదు నెలల కిందటి ఎన్నికల్లో ఎలాంటి అవమానకరమైన ఓటమిని పొందామో గుర్తు పెట్టుకుని, ఐదేళ్లకు ఎన్నికలు వస్తాయి కాబట్టి..వాటిల్లో సత్తా చూపడానికి ప్రిపేర్ అయితే అయనకే మంచిదని పరిశీలకులు అంటున్నారు.