మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం గురించి శివసేన తన డిమాండ్స్ విషయంలో వెనక్కు తగ్గడంలేదు. భారతీయ జనతా పార్టీ ఫిఫ్టీ: ఫిఫ్టీ ఒప్పందానికి రావాలని అంటోంది సేన. అందులో భాగంగా ముఖ్యమంత్రి పదవిని సగంసగం కాలం పంచుకోవడంతో పాటు, మంత్రి పదవులు, అన్ని నామినేటెడ్ పోస్టుల విషయంలో సగంసగం వాటా కావాలని కమలం పార్టీని డిమాండ్ చేస్తోంది శివసేన. ఆదిత్య ఠాక్రేని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని శివసేన భావిస్తోంది.
అయితే ఈ డిమాండ్లు తమకు తెలియవని అంటున్నారు కమలం పార్టీ వాళ్లు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ సేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానిస్తున్నారట. ప్రత్యామ్నాయం అంటే.. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. అందుకు కాంగ్రెస్ సై అంటోంది. ఎన్సీపీ మాత్రం చూద్దాం అనే ధోరణిలో ఉంది.
అయితే కాంగ్రెస్ తో చేతులు కలపదలుచుకోవడం లేదన్నట్టుగా.. బీజేపీనే తమ దారికి రావాలని, ఒప్పంద పత్రంపై సంతకాలకు రావాలని శివసేన అంటోందట. అయితే బీజేపీ మాత్రం ఇంకా మహారాష్ట్ర విషయంలో నోరు విప్పడంలేదు. చివరకు అయితే బీజేపీ-శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమే.
అయితే ఈసారి శివసేన కమలం పార్టీని అంత తేలికగా అయితే వదలదని స్పష్టం అవుతోంది. తన డిమాండ్స్ విషయంలో ఆ పార్టీ గట్టిగా పట్టుపట్టవచ్చు. అందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.