పెళ్లి అంటే రెండు మనసుల ఇష్టాలతో ముడిపడిన అద్వితీయమైన బంధం. అయితే అమ్మాయి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండానే మూడు ముళ్లు వేయించి తమ బాధ్యత తీరిపోయిందని భావించే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రులను కాదని ధైర్యంగా తిరగబడితే, అలాంటి వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. శభాష్ అంటూ అభినందిస్తాం.
తన ఇష్టాన్ని కాదని పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులపై అధికారులకు ఓ బాలిక ఫిర్యాదు చేసింది. బాలిక స్ఫూర్తికి మెచ్చిన జిల్లా అధికారులు సత్కరించి, ఆమె ఇష్టానికి తగ్గట్టు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన బాలిక (16) ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని.
చదువంటే ఎంతో ఇష్టం. డాక్టర్ కావాలనేది ఆ విద్యార్థిని ఆశయం. అయితే విద్యార్థిని చదువు ఇష్టపడితే, కూతురికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆలోచించారు. తల్లిదండ్రుల ఆలోచనల్ని పసిగట్టిన బాలిక తనకు పెళ్లి చేస్తారని భయాందోళనకు గురైంది. దీంతో చైల్డ్ నంబర్ 1098కు ఫోన్ చేసి తన ఆవేదనంతా వ్యక్తం చేసింది.
‘మైనార్టీ తీరకుండానే నాకు వివాహం చేయాలని చూస్తున్నారు.. నాకు చదువుకోవాలని ఉంది. ఈ వివాహాన్ని ఎలాగైనా అడ్డుకోండి సార్ ఫ్లీజ్…’ అంటూ చైల్డ్‌లైన్ అధికారులను వేడుకుంది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు విద్యార్థిని గ్రామానికి వెళ్లారు.
విద్యార్థినితో పాటు తల్లిదండ్రులతో మాట్లాడారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి కూతురికి పెళ్లి చేయాలనే ఆలోచ నను విరమింపజేశారు. మైనార్టీ తీరాకే వివాహం చేస్తామని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం తీసుకున్నారు. అలాగే ధైర్యంగా తమకు ఫోన్ చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన సదరు విద్యార్థిని సన్మానించారు.