పోలవరం ‘స్పిల్‌ వే’పైకి నీళ్ళొచ్చాయ్‌..!

ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే పైకి నీళ్ళొచ్చాయి. మామూలుగా అయితే, ఇదొక అద్భుతం. కానీ, దురదృష్టవశాత్తూ ప్రాజెక్టు పరిస్థితి అయోమయంలో పడిపోయాక.. వరద నీటి కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో…

ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే పైకి నీళ్ళొచ్చాయి. మామూలుగా అయితే, ఇదొక అద్భుతం. కానీ, దురదృష్టవశాత్తూ ప్రాజెక్టు పరిస్థితి అయోమయంలో పడిపోయాక.. వరద నీటి కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాత్రమే స్పిల్‌ వే పైకి నీళ్ళు తీసుకురావాల్సి వచ్చింది. కేంద్రం నిధులు సకాలంలో విడుదల చేస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈలోగా పోలవరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం దండుకున్న నిధుల్ని కక్కించడానికి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నడుం బిగించింది. అందులో కొంతయినా కక్కించగలిగితే.. రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచన. 

ఇదిలా వుంటే, పోలవరం ప్రాజెక్టు కల సాకారమైపోయిందంటూ మాజీ మంత్రి నారా లోకేష్‌, సోషల్‌ మీడియాలో కామెడీగా ఓ వీడియో పెట్టారు. నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగి, పోలవరం ప్రాజెక్టుకి సకాలంలో నిధులు రాకపోయినా, బీజేపీని భుజాన మోసిన టీడీపీ.. ఐదో ఏడాది, బీజేపీతో పంచాయితీ పెట్టుకుని.. పబ్లిసిటీ స్టంట్లు చేసి, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధులు ఇవ్వలేదు మొర్రో.. అంటూ ఆడిన నాటకాల్ని జనం ఎలా మర్చిపోగలరు.? 

ఒక్కటి మాత్రం నిజం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఎంత తప్పిదానికి పాల్పడ్డారో.. అంతకన్నా ఎక్కువ తప్పిదాలు బీజేపీ చేసింది. జాతీయ ప్రాజెక్టుని రాష్ట్రానికి అప్పగించి, చేతులు దులుపుకోవడమేంటి.? చంద్రబాబు సర్కార్‌, పోలవరం ప్రాజెక్టుతో 'ఆమ్యామ్యాలు' దండుకుంటోటే, కేంద్రం చూస్తూ ఊరుకోవడమేంటి.? 'లెక్కలు చెప్పలేదు కాబట్టి, నిధులు ఇవ్వలేదు' అంటూ, బీజేపీ నేతలు కథలు చెప్పడమేంటి.? 

ఏదిఏమైనా, పోలవరం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌. సకాలంలో ప్రాజెక్టు నిర్మితమై వుంటే, ఈ ఏడాది వరద నీటినే కొంత మేర జాగ్రత్త చేసుకోవడానికి వీలయ్యేది. పోలవరం ప్రాజెక్టుకి బ్రిటిష్‌ పాలనలోనే బీజం పడింది.. దశాబ్దాలు గడిచాయ్‌.. ప్రభుత్వాలు మారుతున్నాయ్‌.. ఇప్పుడు.. ఇదిగో, ఇలా స్పిల్‌ వే పైకి నీళ్ళొచ్చాయని పండగ చేసుకోవాలా.?