ఈ కరోనా కష్టకాలంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి అందరికీ గుర్తుచేసే ఘటన ఇది. కొడుకు పుట్టాడనే ఆనందంలో స్పీట్స్ పంచిన ఓ వ్యక్తి, తన ద్వారా 10 మందికి కరోనా అంటించాడు. హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో జరిగింది ఈ ఘటన. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీళ్లంతా పోలీసులే.
హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిథిలో పనిచేసే ఓ కానిస్టేబుల్ కు కొడుకు పుట్టాడు. ఆ ఆనందాన్ని ఇతర పోలీసులతో పంచుకున్నాడు సదరు కానిస్టేబుల్. స్వీట్స్ తెచ్చి అందరికీ పంచాడు. అలా స్వీట్స్ తిన్న 10 మంది పోలీసులకు కరోనా వచ్చింది.
కొడుకు పుట్టాడనే ఆనందంలో ఉన్న కానిస్టేబుల్ కు కరోనా లక్షణాల్లేవ్. కానీ అతడికి కరోనా సోకింది. అతడి తమ్ముడి ద్వారా కరోనా సోకినట్టు పోలీసులు భావిస్తున్నారు. అలా లక్షణాలు లేకుండానే 10 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదు. పోలీసులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులందర్నీ హోం క్వారంటైన్ లో ఉంచారు. అందర్నీ ఇళ్లలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఎవ్వరూ బయటకు రావొద్దని, మాస్కులు పెట్టుకోవాలని, పార్టీలు-వేడుకలు చేయొద్దని పోలీసులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా సిటీలో మరోసారి లాక్ డౌన్ విధించడానికి మాత్రం ప్రభుత్వం ఇష్టపడడం లేదు.