కొన్ని రోజుల కిందటి సంగతి. శాసనమండలిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసభ్యంగా ప్రవర్తించారని, మహిళా సభ్యుల ముందుకెళ్లి జిప్ తీస్తానంటూ సైగలు చేసి అనుచితంగా మాట్లాడారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే అనీల్ కుమార్ ఛాలెంజ్ విసిరారు. అలా తను మిస్-బిహేవ్ చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధమని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి అప్పటి సవాల్ ను గుర్తుచేశారు మంత్రి.
“శాసన మండలిలో మహిళల ముందు నేను జిప్ తీశానంటూ నా క్యారెక్టర్ ను కించపరిచేలా లోకేష్ చౌదరి, రాజేంద్రప్రసాద్ చౌదరి నాపై ఆరోపణలు చేశారు. నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ఆరోజే సవాల్ విసిరాను. అంతేకాదు, ఆ వీడియో ఉంటే రిలీజ్ చేయమని ఛైర్మన్ కు నేను లేఖ కూడా రాశాను. లెటర్ రాసి 15 రోజులైంది. ఇప్పటివరకు టీడీపీ నుంచి సమాధానం లేదు. వీడియో ఉంటే బయటపెట్టమని నేనే స్వయంగా అడుగుతున్నాను కదా. అలాంటి వీడియో ఉంటే బయటపెట్టండి.”
ఓ బీసీని ఇష్టమొచ్చినట్టు ఏదైనా అనొచ్చనే అహంకారం టీడీపీ నేతల్లో ఉందన్నారు అనిల్ కుమార్ యాదవ్. తనను కూడా గతంలో గొర్రెలు కాసుకునే వ్యక్తి అంటూ అవమానించారని గుర్తుచేశారు. వైసీపీలో ఉన్న బీసీల్ని తిడితే తప్పు లేదు కానీ, నేరాలు చేసిన టీడీపీ బీసీల్ని అరెస్ట్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు.
“అచ్చెన్నాయుడు పేదల సొమ్ము 150 కోట్లు కాజేశారు. అయ్యన్నపాత్రుడు ఓ మహిళను పట్టుకొని గుడ్డలూడదీసి కొడతానన్నాడు. కొల్లు రవీంద్ర ఏకంగా హత్యకు సహకరించాడు. వీళ్లు బీసీలు కాబట్టి ఏం అనకూడదా. బీసీలు టీడీపీలో ఉంటే ఒక నీతి, ఇతర పార్టీల్లో ఉంటే మరో నీతి ఎలా జరుగుతుందో చంద్రబాబు చెప్పాలి.”
బీసీలకు గత ప్రభుత్వంలో ఏం చేశారో ఓసారి గుర్తుచేసుకోవాలని చంద్రబాబుకు సూచించారు అనీల్. జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే బీసీలను అన్ని రకాలుగా ఆదుకున్నారని అన్నారు.