వదరబోతు వ్యాఖ్యానాలు చేసే నటీమణికి వై కేటగిరి భద్రత! వాడు తనకు ఇది చూపించాడు, ఇది చూపించాడు.. అంటూ మసాలా ట్వీట్లు వేసే మహిళామణికి సాయుధ పోలీసుల భద్రత! తనను ఇబ్బంది పెట్టిన వారి పేర్లను చెప్పి, కేసులు పెట్టకుండా.. ఆమె మసాలా మాటలు చెబుతూ జనాలను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది! బీజేపీ ప్రత్యర్థి రాజకీయ నేతలను అసమర్థులు అంటూ మాట్లాడుతూ ఉంటుంది! అందుకే కదా.. వై కేటగిరి!
బీజేపీలో కెళ్లా సమర్థ ముఖ్యమంత్రి ఉన్న చోట ఒక దళిత యువతిపై అత్యాచారం. అది మామూలుగా కాదు..ఆమె వెన్నెముక విరగొట్టారు, దుప్పటిని ఆమె మెడకు చుట్టి కొన్ని వందల మీటర్లు ఈడ్చుకెళ్లారు… ఆ ఘటన ఎలా జరిగిందనే వార్తలను చదివితే ఒళ్లు జలదరిస్తుంది. ఊహించుకుంటేనే ఉలిక్కిపడేలా జరిగిన ఆ అత్యాచారోదంతం.. నిర్భయ, దిశ ల సంఘటనల కన్నా దారుణమైనది.
ఈ సంఘటనను దేశంలో అనునిత్యం జరిగే ఎన్నో అత్యాచార ఘటనల్లో ఒకటి అని తేలికగా తీసుకునే పక్షంలో.. కనీసం బాధిత కుటుంబం పట్ల అయినా సానుభూతి ఉండాల్సింది! అయితే యోగి రాజ్యంలో అది కూడా కరువైంది.
ఆర్ధరాత్రి అంత్యక్రియలు జరిపే దేశమా మనది? కొంతమంది ఆమెను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, చంపి.. శవంగా వదిలి పెట్టి వెళితే, పోలీసులు మిగతా పని పూర్తి చేశారు! ఆనవాలు మిగలకుండా, అర్ధరాత్రి ఆమె శవాన్ని తగలబెట్టేశారు. రేపిస్టులు చేసిన పనికి కొనసాగింపు పనిని పోలీసులు పూర్తి చేసినట్టుగా ఉంది ఈ ఉదంతం.
ఈ ఉదంతంలోనూ యూపీ ప్రభుత్వ తీరును సమర్థించేందుకు భక్తులు అపసోపాలు పడుతున్నారు. సిగ్గు పడాలి, జరిగిన ఘాతుకానికే కాదు, అంతకన్నా ఘోరంగా జరిగిన అంత్యక్రియల విషయంలో అయినా కాస్త సిగ్గుపడాలి. పార్టీలను సమర్థించడంలో మానవత్వాన్ని మరిచిపోయిన వారికి ఆ సిగ్గు ఉండకపోవచ్చు!