కారు డ్రైవ్ చేసింది యాషికానే.. కేసు పెట్టిన పోలీసులు

రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హీరోయిన్ యాషికా ఆనంద్ పరిస్థితి నిలకడగా ఉంది. చెన్నైలోని అపొలో హాస్పిటల్ లో జాయిన్ చేసిన కొన్ని గంటలకే ఆమెకు స్పృహ వచ్చింది. ప్రాణాపాయం…

రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హీరోయిన్ యాషికా ఆనంద్ పరిస్థితి నిలకడగా ఉంది. చెన్నైలోని అపొలో హాస్పిటల్ లో జాయిన్ చేసిన కొన్ని గంటలకే ఆమెకు స్పృహ వచ్చింది. ప్రాణాపాయం తప్పింది. యాషిక తలకు పెద్దగా గాయాలు కాలేదు. మోచేయి, పాదం, నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మోచేయి, నడుము భాగాలకు ఈరోజు శస్త్రచికిత్స చేస్తారు.

మరోవైపు ఈ కేసుపై పోలీసులు నిశితంగా దృష్టిపెట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో యాషికానే కారును నడుపుతున్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదంలో యాషిక స్నేహితురాలు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవానీ అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించి యాషికాపై సెక్షన్ 279, 337, 304 కింద 3 కేసులు పెట్టారు పోలీసులు. వీటిలో సెక్షన్ 304 కింద పదేళ్లు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది.

మరోవైపు కారు నడుపుతున్న సమయంలో యాషికా మద్యం సేవించిందా లేదా అనే అంశంపై మాత్రం పోలీసులు నోరువిప్పడం లేదు. త్వరలోనే పూర్తి ఆధారాల్ని కోర్టుకు సమర్పిస్తామని చెబుతున్నారు. ఇక యాషికాతో పాటు ప్రమాదానికి గురైన మరో ఇద్దరు వ్యక్తుల్లో ఒకర్ని యాషిక బాయ్ ఫ్రెండ్ గా గుర్తించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అపోలో హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి.

ఈ మొత్తం వ్యవహారంలో ఏడాది కిందట జరిగిన ఓ ఘటనను కూడా బయటపెట్టారు పోలీసులు. అటుఇటుగా ఏడాది కిందట యాషికా ఆనంద్ రోడ్డు యాక్సిడెంట్ చేసింది. ఆ ఘటనలో రోడ్డుపై ఉన్న ఓ డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడిలా తనే గాయాల పాలైంది. ఈ రెండు కేసుల్లో అతివేగమే కారణమంటున్నారు పోలీసులు.

ప్రస్తుతం యాషిక చేతిలో 5 తమిళ సినిమాలున్నాయి. ఇవన్నీ సెట్స్ పై ఉన్నాయి. వీటిలో 2 సినిమాల షూటింగ్స్ లో యాషికా ఇంకా జాయిన్ అవ్వలేదు.