తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్న రెండు ఉప ఎన్నికల్లో ఒకదాని రిజల్ట్ ముందే ఫిక్స్ అయింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చినా, రాకపోయినా ఏపీలో విజయం వైసీపీదే. కానీ హుజూరాబాద్ లో అలాంటి పరిస్థితి లేదు. గట్టి పోటీ ఉంది. దీంతో అధికారులు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించారు.
ముందస్తు ఫలితాలంటూ ఎవరైనా హడావిడి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ రాజకీయ విశ్లేషకుల రిపోర్ట్స్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
దాదాపు చాలామంది విశ్లేషకులు ఈసారి షాకింగ్ ఫలితాలు వస్తాయంటున్నారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న కొంతమంది నిపుణులు.. ఈ మాట చెబుతున్నారు.
టీఆర్ఎస్ కి అభ్యర్థి బలమా..? భారమా..?
చాన్నాళ్ల మేథోమథనం తర్వాత టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని అభ్యర్థిగా ఖరారు చేసి అందరికీ షాకిచ్చారు సీఎం కేసీఆర్. ఈటలపై పోటీకి సీనియర్ అయితే బాగుంటుందని కొంతమంది సూచించినా ఆయన ససేమిరా అన్నారు.
ఇప్పుడు ఈటలకు అదే ప్లస్ పాయింట్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సర్వే ప్రకారం హుజూరాబాద్ లో అధికార పార్టీకి షాక్ తగిలేలా ఉంది.
శత్రువుకి శత్రువు.. మిత్రుడు..
మొదట్లో కాంగ్రెస్ కూడా హుజూరాబాద్ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. రానురాను టీఆర్ఎస్ ఓడిపోతే చాలు అనుకునేలా మారిపోయింది.
బలమైన అభ్యర్థిని అక్కడ బరిలో దింపాలనుకున్నా.. కొత్తవారిని తెరపైకి తెచ్చింది అధిష్టానం. దీంతో కాంగ్రెస్ కూడా పరోక్షంగా ఈటల విజయానికి చిరుసాయం చేస్తున్నట్టే అనుకోవాలి.
ఈటల Vs టీఆర్ఎస్
టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కొత్తల్లో ఒంటరిగా ప్రజల్లో తిరిగారు ఈటల రాజేందర్. ఓ దశలో సొంతంగా పార్టీ పెడతారని కూడా అనుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా ఆయనకే మద్దతుగా ఉండటంతో టీఆర్ఎస్ కి అక్కడ అంత సీన్ లేదని అనుకున్నారంతా. కానీ రోజురోజుకీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డిని చేర్చుకోవడం, ఇతర పార్టీల ఛోటామోట నేతలకి కూడా కండువాలు కప్పేసి పొలిటికల్ గేమ్ ఆడారు కేసీఆర్. ఆ తర్వాత దళిత బంధు.. మరో పెద్ద మలుపుగా మారింది.
మరోవైపు బీజేపీలో చేరిన ఈటలకు, ఆ పార్టీ రైతు ఉద్యమాల విషయంలో కఠినంగా ఉండటం కాస్త ఇబ్బందిగా మారే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అటు టీఆర్ఎస్ నేతలు కూడా ఈటలను అదే విషయంలో టార్గెట్ చేస్తున్నారు. బీజేపీని ఇరుకున పెడుతూ, పరోక్షంగా ఈటలపై మాటల తూటాలు ఎక్కుపెడుతున్నారు.
ఇప్పటివరకూ అధికార పార్టీకి ఎలాంటి ఢోకా లేదనే ప్రచారం జరిగింది. పథకాలు, పనులతోపాటు.. ఓట్లకు నోట్లు కుమ్మరిస్తుండటంతో టీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడకేననుకున్నారు. కానీ ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని తెలుస్తోంది. హుజూరాబాద్ లో ఈటల దెబ్బ మామూలుగా ఉండదని, స్థానికంగా ఆయన సత్తా ఏంటో ఈ ఎన్నికలతో తెలుస్తుందని చెబుతున్నారు.
దుబ్బాకలో సెంటిమెంట్ ఫలించకపోయినా.. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ కి అదే సెంటిమెంట్ కలిసొచ్చింది. ఇప్పుడు హుజూరాబాద్ లో పార్టీ గొప్పదా, బయటికొచ్చి నాయకుడు గొప్పవాడా.. కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా లేక విశ్లేషకుల మాట నిజమౌతుందా అనే విషయం త్వరలోనే తేలిపోతుంది.