ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా పొత్తుల సినిమా

తెలంగాణా కంటే ఏపీ రాజకీయాలు ప్రజలకు ఆసక్తికరంగా ఉంటున్నాయి. తెలంగాణలో రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. కేసీఆర్ పార్టీని ఓడించాలనే కోరిక ఆయన వ్యతిరేక పార్టీల్లో బలంగా ఉంది. ప్రతిపక్షాలలో బలంగా ఉన్నవి రెండే…

తెలంగాణా కంటే ఏపీ రాజకీయాలు ప్రజలకు ఆసక్తికరంగా ఉంటున్నాయి. తెలంగాణలో రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. కేసీఆర్ పార్టీని ఓడించాలనే కోరిక ఆయన వ్యతిరేక పార్టీల్లో బలంగా ఉంది. ప్రతిపక్షాలలో బలంగా ఉన్నవి రెండే రెండు. ఒకటి బీజేపీ. మరొకటి కాంగ్రెస్. మిగతా పార్టీలన్నీ నాంకేవాస్తే పార్టీలే. ప్రతిపక్షాలలో కేసీఆర్ ను ఓడించాలనే కోరిక ఉందిగానీ ఐక్యత లేదు.

ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. కానీ ఇప్పుడు బలహీనపడింది. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ కు అస్తిత్వం ఉన్నా దాని నాయకులే దానికి శత్రువులు. బీజేపీ లక్కీగా రెండు ఉపఎన్నికల్లో గెలిచి, జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో సత్తా చాటినా టీఆర్ఎస్ కు పోటీ మాత్రం కాదనిపిస్తోంది. తన పార్టీకి బీజేపీ ప్రధాన శత్రువుగా భావిస్తున్న కేసీఆర్ దాన్ని వచ్చే ఎన్నికల్లో పైకి లేవకుండా చేయడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతుండటం చూస్తున్నాం.

ఇక ఏపీ విషయానికొస్తే …జగన్ ను ఓడగొట్టాలనే కోరిక ప్రతిపక్షాలకు ఉంది. ఇక్కడా నాంకేవాస్తే పార్టీలు కొన్ని ఉన్నా ప్రధానంగా చెప్పుకునేవి మూడే మూడు పార్టీలు. మొదటిది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. రెండోది జనసేన. మూడోది బీజేపీ. ఇప్పుడు ఈ మూడు పార్టీల పొత్తు సినిమా మొదలైంది. ఈ మూడింటిలో ఏయే పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి? రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయా ? మూడూ కలిసి పొత్తులు పెట్టుకుంటాయా ? ఇప్పుడు ఈ అంశం ఆధారంగానే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారంలోకి వస్తామని ఏ పార్టీకా పార్టీ చెప్పుకుంటున్నాయి.

కానీ కలిసి అధికారంలోకి వస్తామని ఇప్పటివరకు చెప్పలేదు. ప్రస్తుతం బీజేపీ – జనసేన పొత్తులో ఉన్నాయి. కానీ వాటి పొత్తు పెటాకులవుతుందని గతంలో మీడియాలో కథనాలు వచ్చాయి. అలాగే టీడీపీ – జనసేన పొత్తు మీద కూడా కథనాలు, ఊహాగానాలు వస్తున్నాయి. ‘రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే’..అంటోంది బీజేపీ. ’వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తాను’..అన్నాడు పవన్ కళ్యాణ్ ఈమధ్య పార్టీ ఆవిర్భావ సభలో. మరి వీళ్ళు చెబుతున్నట్లు మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చేయటం ఖాయమా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేయటం సాధ్యమేనా?

బీజేపీ అధికారంలోకి రాలేదని అందరికీ తెలుసు. వీర్రాజు ఏదో మీడియాకోసం చెప్పే మాటలే కానీ అందులో నిజం లేదనే సంగతి ఆయనకూ తెలుసు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడటం పవన్ తరం కాదంటున్నారు విశ్లేషకులు. బీజేపీకి చంద్రబాబునాయుడు అంటే పడదు. అలాగే బీజేపీతో వామపక్షాలు, కాంగ్రెస్ కు పొసగదు. ఒకవేళ బీజేపీతో కటీఫ్ చేసి పవన్ టీడీపీతో పొత్తుపెట్టుకున్నా అప్పుడు కూడా ప్రతిపక్షాల ఓట్లను ఐక్యంగా ఉంచటం పవన్ వల్లకాదు. బీజేపీ, జనసేనకు ఉన్న ప్రధాన సమస్య ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడమే.

జనసేనకు పవన్ అధినేత కాబట్టి ఆయన ఇమేజ్ ఉపయోగపడవచ్చు. కానీ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇక బీజేపీకి నాయకత్వ ఆకర్షణలేదు. గ్రౌండ్ లెవెల్ లో బలం లేదు. 175 అసెంబ్లీ స్థానాలకు. 25 పార్లమెంటు సీట్లకు అభ్యర్థులు దొరకడం కష్టమే. అభ్యర్థులు దొరకడమంటే బలమైన వారు కావాలి. అలాంటివారు దొరికే అవకాశం లేదని తెలుస్తోంది. ఏదో పార్టీల తరపున నామినేషన్లు వేశామంటే వేశామనిపించుకోవటం తప్ప కనీసస్ధాయిలో కూడా పోటీ ఇవ్వలేరు.

గెలుపు సంగతి దేవుడెరుగు కనీసం పోటీకి గట్టి అభ్యర్ధులను కూడా నిలబెట్టలేకపోతే ఎంత అవమానం? ఆ అవమానాన్ని తప్పించుకునేందుకే చంద్రబాబుతో పొత్తుకు పవన్ రెడీ అవుతున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో బీజేపీ ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ రెండు పార్టీలు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మాత్రమే అభ్యర్ధులను నిలబెట్టగలవు. లేకపోతే ఆ స్ధానాలన్నింటిలో మెజారిటి  వైసీపీ గెలుచుకోవటం ఖాయం. 

సో ….ఇలాంటి నేపథ్యంలో మూడు పార్టీలు కలుస్తాయా? రెండు పార్టీలు మాత్రమే పొత్తులు పెట్టుకుంటాయా? అనేది తేలాల్సి ఉంది. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కాబట్టి ముందే జడ్జ్ మెంట్ ఇవ్వలేం.