ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం ఎంతో గొప్పగా భావిస్తారు. అలాంటి ప్రసిద్ధిగాంచిన తిరుపతి నుంచి ఎంపీగా గెలిచిన వాళ్లకు కేంద్రమంత్రి పదవి దక్కింది. కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లకు మాత్రం ఇంత వరకూ మంత్రి పదవి దక్కకపోవడం చర్చనీయాంశమైంది.
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు మొదటిసారిగా తిరుపతి నుంచే ప్రాతినిథ్యం వహించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎన్టీఆర్‌ను మినహాయిస్తే ఏ ఒక్కరూ కనీసం మంత్రి పదవికి నోచుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం జగన్ కొత్త కేబినెట్ తెరపైకి వస్తున్న నేపథ్యంలో అక్కడి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి మంత్రి పదవి గురించి చర్చ జరుగుతోంది. కరుణాకరరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తిరుపతి ఎమ్మెల్యేలెవరికీ ఇంత వరకూ కేబినెట్‌లో చోటు దక్కలేదనే కొరత తీరుతుంది.
గత సార్వత్రిక ఎన్నికల ముందు… ఇవే తన చివరి ఎన్నికలని భూమన కరుణాకరరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట విప్లవ రాజకీయాల నుంచి ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతర కాలంలో వైఎస్ రాజారెడ్డి, తనయుడు రాజశేఖర రెడ్డిలతో పరిచయం ఆయన్ను భూర్జువా రాజకీయాల వైపు నడిపించింది. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరొందిన భూమన … రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ వెంట నడిచారు.
వైఎస్ జగన్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించిన తరుణంలో ఆయన వెంట నడిచిన అతి కొద్ది మందిలో భూమన ఒకరు. వైఎస్ జగన్ మహాపాద యాత్ర, ఓదార్పు యాత్రల్లో భూమన క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్ కుటుంబంతో పాటు ఆయన పేరుతో అవతరించిన రాజకీయ పార్టీ ఫ్యామిలీలో కూడా భూమన ముఖ్యమైన వ్యక్తి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణాకరరెడ్డికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే చర్చకు తెరలేచింది.
రాజకీయ వ్యూహాల్లో అనుభవం ఉన్న కరుణాకరరెడ్డి లాంటి వాళ్లను జగన్ పక్కన పెట్టడంపై ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్యపోయాయి. వైసీపీ ప్రభుత్వ పాలన సగం కాలం పూర్తి కావడం, అలాగే తమ నాయకుడు రాజకీయాలకు దూరమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కొత్త కేబినెట్‌లో కరుణాకరరెడ్డికి స్థానం కల్పించకుండా ఉంటారా? అని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
రాజకీయాల్లో హూందాతనం, విలువలు కోరుకునే కరుణాకరరెడ్డి లాంటి ఎమ్మెల్యేలకు స్థానం కల్పించడం అవసరమనే డిమాండ్ వైసీపీ శ్రేణుల నుంచి వస్తోంది. మరి జగన్ మనసులో ఏముందో తెలియదు. అన్నిటికి కాలమే జవాబు చెప్పాల్సి వుంది.