ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి సంచలన కామెంట్స్ చేశారు. జగన్ను దూరం నుంచి చూస్తే ఎలా వుంటారు? అలాగే దగ్గరగా చూస్తే ఎలా కనిపిస్తారో పోసాని చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇవాళ ఆయన కలియుగ దైవం, తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలకు ఎన్నిసార్లు వచ్చానో గుర్తు లేదన్నారు. పదో తరగతి పాస్ అయినప్పుడు మొట్ట మొదటగా తన మేనమామ (కొరటాల శివ తండ్రి) తిరుమలకు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత చాలా సార్లు తిరుమలకు వచ్చినట్టు తెలిపారు.
తిరుమల శ్రీవారితో పాటు ప్రేక్షకుల దయతో ఇండస్ట్రీలో మూడు, నాలుగు దశాబ్దాలుగా సంతోషంగా ఉన్నట్టు పోసాని చెప్పారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి గురించి ఒక మాట చెబుతానన్నారు. దీనిపై మళ్లీ కౌంటర్ ప్రశ్నలు వేయొద్దంటూ జగన్ గురించి చెప్పుకొచ్చారు.
దూరం నుంచి జగన్ను చూస్తే బ్రహ్మపదార్థంలా కనిపిస్తారన్నారు. దగ్గరగా చూస్తే దేవుని ప్రసాదంలా కనిపిస్తారని పోసాని తన మనసులో మాటను కలియుగ దైవం సాక్షిగా బయట పెట్టారు.