మంత్రి పదవి అంటే అందరికీ మోజే. ఆ హోదా కోసం ఎవరైనా పరితపించడం పరిపాటి. అలాంటి మంత్రి పదవి మీద విపరీత ప్రచారం విషయంలో మాత్రం ఒక సీనియర్ ఎమ్మెల్యే అసహనంగా ఉన్నారు. కాబోయే మంత్రి గారు మా కరణం ధర్మశ్రీ గారు అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న దాని మీద చోడవరం వైసీపీ ఎమ్మెల్యే మండిపడుతున్నారుట.
ఏంటి విపరీత ప్రచారం. ఆపండెహే అంటూ ఆయన తన వారినే కసురుకుంటున్నారని భొగట్టా. ఇంతకీ కరణం ధర్మశ్రీకి ఆగ్రహం కలిగించిన విషయమేంటి అంటే సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఆయన మీద అనుకూల వార్తలు రావడమే. త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో ధర్మశ్రీకే మంత్రి పదవి అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
అంతే కాదు, మా నేతకు మంత్రి పదవి గ్యారంటీ అని ఆయన అభిమానులు, అనుచరులు సోషల్ మీడియాను షేక్ చేసేలా వార్తలను దట్టించేస్తున్నారు. ఇక అంతటితో తగ్గకుండా ధర్మశ్రీకు మంత్రి పదవి ఖరారు అయింది. ఈ నెల 23న దాని మీద అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని కూడా న్యూస్ పెట్టేసి హోరెత్తినేస్తున్నారు.
దీంతో విషయం పూర్తిగా తెలుసుకున్న ఎమ్మెల్యే సీరియస్ అవుతున్నారుట. ఇలాంటి ప్రచారాలు ఏంటి బాబూ అంటూ తన అనుచరులకే క్లాస్ పీకుతున్నారుట. మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి పదవులు దక్కుతాయి అన్నది ఇప్పటికైతే కచ్చితంగా తెలియదు. దాని మీద ఊహాగానాలే అంతటా ఉన్నాయి.
ఒక వేళ పరిస్థితులు బాగుంటే కరణం ధర్మశ్రీకు దక్కినా దక్కవచ్చు. కానీ దురభిమానంతో ఫ్యాన్స్ చేసే హంగామా వల్ల అనుకూలం కాస్తా ప్రతికూలం అవుతుంది అని ఎమ్మెల్యే ఆందోళన చెందితే అందులో నిజం ఉంది కదా. మొత్తానికి కాబోయే మంత్రి గారు అని ఇపుడు కరణం ధర్మశ్రీని ఎవరైనా అంటే చికాకు పడే స్థాయికి తెచ్చేశారు కరడు కట్టిన ఆయన గారి ఫ్యాన్స్ అని అంటున్నారు.