ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రోజురోజుకూ బరి తెగిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ అధినేత కౌరవ సభతో పోల్చిన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని మొదట కొందరు టీడీపీ సభ్యులు ప్రతిపాదించారు. అసెంబ్లీకి ఇక వెళ్లేది లేదని ఎల్లో మీడియాలో రాయించుకున్నారు. తీరా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి టీడీపీ నిర్ణయాన్ని మార్చుకుని, వెళ్లేందుకే నిర్ణయించుకుంది.
గవర్నర్ ప్రసంగం మొదలుకుని, ఆ తర్వాత జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ టీడీపీ సభ్యుల గొడవ మొదలైంది. అసెంబ్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడడంపై …. ప్రతిపక్ష నాయకుడు అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ నిర్ణయించడం వెనుకున్న ఉద్దేశం ఏంటో గవర్నర్ ప్రసంగం నాడే తెలిసిపోయింది. కల్తీ సారా ఎపిసోడ్‌పై చర్చ జరగాలని టీడీపీ పట్టుపట్టడం, దానికి స్పీకర్ తమ్మినేని అనుమతించకపోవడంతో వారు రచ్చకు దిగారు.
కాగితాలు చించి, స్పీకర్‌పై విసిరేశారు. కనీసం రెండోరోజు నుంచేనా అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తారని అధికార పార్టీ భావించింది. అయితే అలాంటి అవకాశానికే టీడీపీ సభ్యులు చోటు ఇవ్వలేదు. ప్రతిరోజూ అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది.
ఇవాళ టీడీపీ సభ్యులు మరింత ముందుకెళ్లి ఏకంగా విజిల్స్ వేసి, తమ దుందుడుకు తనాన్ని ప్రదర్శించారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బాలినేని సమాధానమిస్తుండగా టీడీపీ సభ్యులు వింతగా ప్రవర్తించారు. టీడీపీ సభ్యుడు సాంబశివరావు విజిల్ వేయడంపై స్పీకర్ సిరియస్ అయ్యారు. సభా మర్యాదను కాపాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
సినిమా హాళ్లలో విజిల్స్ వేయడం చూశాం. కానీ ఏపీ అసెంబ్లీలో అలాంటి సీన్ కనిపించడం విమర్శలకు దారి తీసింది. మీడియా అటెన్షన్ కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్ధంగా ఉన్న వైనాన్ని మనం చూడొచ్చు.