Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ స్వ‌యంకృతాప‌రాధం

జ‌గ‌న్ స్వ‌యంకృతాప‌రాధం

హైకోర్టులో వ‌రుస ఎదురు దెబ్బ‌ల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వ‌యంకృతాప‌రాధ‌మే కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌త్య‌ర్థుల ఆశ‌ల మేర‌కు జ‌గ‌న్ పాల‌న సాగిస్తున్నార‌నేందుకు హైకోర్టులో వ‌స్తున్న ప్ర‌తికూల తీర్పులే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పొచ్చు. ప్ర‌త్య‌ర్థుల చేతికి ప‌దునైన ఆయుధాల‌ను స్వ‌యంగా జ‌గ‌నే అందిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా మ‌రోసారి హైకోర్టులో జ‌గ‌న్ స‌ర్కార్‌కు భారీ షాక్ త‌గిలింది.

నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా తొల‌గిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టి వేసింది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ‌ను కొన‌సాగించాల్సిందేన‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. ఆర్టిక‌ల్ 213 ప్ర‌కారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్ర‌భుత్వానికి లేద‌ని హైకోర్టు తేల్చి చెప్పింది.

ప‌దేప‌దే ఏపీ స‌ర్కార్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ‌లు త‌గల‌డంతో పాటు జ‌గ‌న్ పాల‌న ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ...స‌ర్కార్ పెద్ద‌లు త‌మ పాల‌న‌లో ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇప్ప‌టికీ ఎదురు దెబ్బ‌ల నుంచి గుణ‌పాఠాలు నేర్చుకోక‌పోతే మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్ప‌వు. ముఖ్యంగా కీల‌క‌మైన హైకోర్టు తీర్పుల‌పై స‌మీక్షిద్దాం.

తాజాగా నిమ్మ‌గ‌డ్డ కేసునే మొద‌ట తీసుకుందాం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దించ‌కుండా వాయిదా వేయ‌డం నిమ్మ‌గ‌డ్డ చేసిన మొద‌టి త‌ప్ప‌. అయితే ఎన్నిక‌ల‌ను వాయిదా వేశార‌నే అక్క‌సుతో నేరుగా సీఎం జ‌గ‌నే మాట్లాడ్డం స‌రైంది కాదు. అందులోనూ చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన వాడు అన‌డం, ఇత‌ర‌త్రా మాట‌లు జ‌గ‌న్ స్థాయికి త‌గిన‌వి కావు. ఆ త‌ర్వాత ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్ల‌డం, మ‌రోవైపు క‌రోనా ముంచుకు రావ‌డం...నిమ్మ‌గ‌డ్డ తీసుకున్న నిర్ణ‌యాన్ని న్యాయ‌స్థానాలు స‌మ‌ర్థించ‌డం అంద‌రికీ తెలిసిన‌వే.

ఆ త‌ర్వాత నిమ్మ‌గ‌డ్డ ఏపీ స‌ర్కార్‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతూ కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శికి లేఖ రాయ‌డం, దానిపై ఎటూ తేల్చ‌కుండా అత‌ను నాట‌కాన్ని ర‌క్తి క‌ట్టించారు. ఈ నేప‌థ్యంలో ఒక్క‌సారిగా ప్ర‌భుత్వం పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో మార్పులు చేయ‌డం, దాని ప్ర‌కారం నిమ్మ‌గ‌డ్డ‌ను ప‌దవి నుంచి తొల‌గించ‌డం చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. చివ‌రికి న్యాయ‌స్థానంలో జ‌గ‌న్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కొట్టివేత‌కు గురైంది. ఒక వ్య‌క్తి న‌చ్చ‌నంత మాత్రాన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డ‌గోలుగా ఆర్డినెన్స్ తీసుకురావ‌డం జ‌గ‌న్ స‌ర్కార్ త‌ప్పిదం కాదా?

హైకోర్టులో విచార‌ణ సాగుతున్న మ‌రో వివాదాస్ప‌ద అంశం స‌చివాల‌చాలు, పంచాయ‌తీ కార్యాల‌యాల‌కు వైసీపీ రంగులు వేయ‌డం. అస‌లు చంద్ర‌బాబును ఇంటికి సాగ‌నంపిన పాల‌సీలు జ‌గ‌న్ ఎందుకు కొన‌సాగిస్తున్నారో అస‌లు అర్థం కాదు. అప్పుడు చంద్ర‌బాబు అడ్డ‌గోలుగా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌సుపు రంగులు వేశారు. ఇప్పుడు అదే పంథాను జ‌గ‌న్ కొన‌సాగిస్తున్నారు. దాన్ని రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌ప్పు ప‌ట్టింది. సంబంధిత జీవోను కొట్టి వేసింది. దీనిపై జ‌గ‌న్ స‌ర్కార్ సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టింది. అక్క‌డ కూడా నిరాశే ఎదురైంది. అప్ప‌టికైనా రంగులు తొల‌గించేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ ముందుకు రావాల్సి ఉంది. అయితే ఆ ప‌నిచేయ‌క‌పోగా ఎర్ర‌మ‌ట్టి క‌ల‌ర్‌ను యాడ్ చేసి ...న్యాయ‌స్థాన ఆదేశాల‌ను పాటిస్తున్నామ‌ని చెప్పుకునేందుకు మ‌రో జీవో జారి చేసింది.

పిల్లి పాలు తాగుతూ ఎవ‌రూ చూడ‌లేద‌ని అనుకున్న చందంగా జ‌గ‌న్ స‌ర్కార్ వ్య‌వ‌హారం ఉంది. మ‌ళ్లీ హైకోర్టులో విచార‌ణ‌. కోర్టు ధిక్క‌ర‌ణ కింద రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పంచాయ‌తీరాజ్‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి, క‌మిష‌న‌ర్‌ల‌పై హైకోర్టు కేసు పెట్టే వ‌ర‌కు వెళ్లింది. అంతేకాదు స్వ‌యంగా సీఎస్‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు త‌ప్పైంద‌ని , కోర్టు ధిక్క‌ర‌ణ త‌మ ఉద్దేశం కాద‌ని అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల్సిన దుస్థితికి కార‌కులెవ‌రు? మ‌ళ్లీ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తున్నారంటే...జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఎలా అర్థం చేసుకోవాలి? అవివేకం ప‌తాక స్థాయికి చేరిన‌ట్టుంది.

మ‌రో వివాదాస్ప‌ద అంశం...ఒక‌టి నుంచి ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మాన్ని ప్ర‌వేశ పెట్ట‌డం. ఇది మంచి నిర్ణ‌యం. అయితే విద్యార్థుల‌కు ఆప్ష‌న్ ఇవ్వాల‌ని అన్ని రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాసంఘాలు డిమాండ్ చేశాయి. కానీ జ‌గ‌న్ స‌ర్కార్ వినిపించుకోలేదు. చివ‌రికి  హైకోర్టు ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ జారీ చేసిన జీవో ఉత్తర్వులను హైరోర్టు రద్దు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవో నెం.81, 85ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.  

ఏ మీడియంలో చ‌దువుకోవాల‌నేది విద్యార్థుల ఇష్టానికి వ‌దిలేయాల‌ని హైకోర్టు సూచించింది. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల అభిప్రాయాల‌ను సేక‌రించిన జ‌గ‌న్ స‌ర్కార్ 96 శాతం మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్య‌మంలో చ‌దువుకునేందుకు మొగ్గు చూపా ర‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఆంగ్ల మాధ్య‌మం అమ‌లుకు జ‌గ‌న్ స‌ర్కార్ ముంద‌డుగు వేస్తోంది. తెలుగు మాధ్య‌మంలో చ‌దువుకోవాల‌నుకునే వాళ్ల‌కు మండ‌లానికో పాఠ‌శాల‌ను ఏర్పాటు చేసి, ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించేందుకు నిర్ణ‌యించింది. ఇదేదో అప్పుడే చేసి ఉండొచ్చు క‌దా? మ‌రెందుకు అన‌స‌వ‌ర‌మైన ర‌చ్చ‌.  

ఇలా ఏ ప‌థ‌కం తీసుకున్నా జ‌గ‌న్ స‌ర్కార్ స్వ‌యంకృతాప‌రాధం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాజ్యాంగం అంటే కేవ‌లం కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థే కాదు....మ‌రికొన్ని ఉంటాయ‌నేది జ‌గ‌న్ స‌ర్కార్ గుర్తించిన‌ట్టు లేదు. అందుకే ఈ విప‌రీత ధోర‌ణులు. వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య అవ‌న‌స‌ర‌మైన ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం. నిమ్మ‌గ‌డ్డను రాజ్యాంగ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డంలోనూ, ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు పార్టీ రంగులు వేయ‌డంలోనూ, న్యాయ‌స్థానాల ఆదేశాల‌ను పెడ‌చెవిన పెట్ట‌డంలోనూ, ఆంగ్ల మాధ్య‌మం అమ‌లు తీరులోనూ జ‌గ‌న్ స‌ర్కార్ తగిన ఎక్స‌ర్‌సైజ్ చేసిన‌ట్టు క‌నిపించ‌డం లేదు.

కేవ‌లం ఆలోచ‌న‌లు మంచివి అయినంత మాత్రాన స‌రిపోదు. వాటి అమ‌ల్లో న్యాయ ప‌ర‌మైన చిక్క‌లు ఎదురు కాకుండా ఉం డాలి. ఆ దిశ‌గా స‌రైన క‌స‌ర‌త్తు చేసిన‌ట్టు పైన పేర్కొన్న మూడు కేసుల్లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల డాక్ట‌ర్ సుధాక‌ర్ కేసును సీబీఐకి అప్ప‌గిస్తూ హైకోర్టు తీర్పు వెలువ‌రిస్తూ....పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ఇందులో భాగంగా 49 మందిపై కోర్టు ధిక్క‌ర‌ణ కేసు న‌మోదైంది.

నిజానికి ఆ ఆగ్ర‌హం జ‌గ‌న్ స‌ర్కార్‌పైనే. అయితే అభిమానం పెంచుకున్న జ‌గ‌న్‌ను తిట్ట‌లేక న్యాయ‌స్థానంపై అంద‌రూ ప‌డ్డారు. అప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో న్యాయ‌స్థానంలో జ‌గ‌న్ స‌ర్కార్‌కు వ్య‌తిరేక తీర్పులు రావ‌డాన్ని వైసీపీ అభిమానులు జీర్ణించు కోలేక‌...ఆ రోజు డాక్ట‌ర్ సుధాక‌ర్ కేసు విష‌య‌మై బ‌ర‌స్ట్ అయ్యారు.

హైకోర్టు, సుప్రీంకోర్టే కాదు...ప్ర‌జాకోర్టు ఆగ్ర‌హానికి గురి కాక ముందే జ‌గ‌న్ స‌ర్కార్ త‌న త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవాల్సి ఉంది. ఏడాది పాల‌న పూర్తి అవుతున్న సంద‌ర్భంగా న్యాయ‌స్థానాల్లో త‌మ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌స్తున్న  తీర్పుల‌పై స‌మ‌గ్రంగా ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. పంతాలు, ప‌ట్టింపుల‌కు పోకుండా వివేకంతో ఆలోచించాలి. అందుకు త‌గ్గ‌ట్టు స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాలి. పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు సంతోషాన్ని ఇచ్చే నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని, తీసుకుంటార‌ని ఆశిస్తూ...

-సొదుం

మన పాలన-మీ సూచన, 5వ రోజు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?