Advertisement

Advertisement


Home > Politics - Political News

చిదంబరం అరెస్టుకు రంగం సిద్ధం!

చిదంబరం అరెస్టుకు రంగం సిద్ధం!

తను ఏ సీబీఐని, ఏ ఈడీని చేతిలో పెట్టుకుని కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ నేతలను గడగడలాడించాడనే పేరును పొందారో, ఇప్పుడు అవే సీబీఐ, ఈడీలు తననే ముప్పుతిప్పలు పెడుతూ ఉండటాన్ని కేంద్ర మాజీమంత్రి చిదంబరం ఎలా ఫీల్ అవుతున్నారో కానీ, ఆయన అరెస్టుకు అయితే రంగం సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. ముందస్తు బెయిల్ అంటూ తమ వద్దకు వచ్చిన చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఆయనపై నమోదైన అభియోగాలను బట్టి ఆయనను అరెస్టు చేసి విచారించడంలో తప్పేంలేదేమో అని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడానికి సీబీఐ, ఈడీలకు మార్గం సుగమం అయ్యిందని పరిశీలకులు తేల్చిచెబుతూ ఉన్నారు. బహుశా మరికొన్ని రోజుల్లోనే చిదంబరాన్ని అరెస్టు చేసి ఏ తీహార్ జైలుకో తరలించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చిదంబరం తనయుడు కార్తీపై సీబీఐ, ఈడీల విచారణ కొనసాగుతూ ఉంది. ఆ వ్యవహారాల్లో కోర్టు చుట్టూ తిరగడమే సరిపోతూ ఉంది కార్తీకి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చిదంబరం అరెస్టుకు కూడా రంగం సిద్ధంకావడం గమనార్హం.

ఐఎన్ఎక్స్ మీడియాలోకి మూడు వందల కోట్ల రూపాయలకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చిన వ్యవహారంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలను సీబీఐ, ఈడీలు నమోదు చేశాయి. ఈ వ్యవహారంపై రెండేళ్లుగా విచారణ సాగుతూ ఉంది. అప్పటి నుంచి ముందస్తు బెయిల్ పిటిషన్లలోనే చిదంబరం నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు విషయంలో కాంగ్రెస్ వాళ్లు ఆక్షేపిస్తూ ఉన్నారు. మరో రెండు రోజుల్లో రిటైరయ్యే న్యాయమూర్తి ఈ తీర్పును హడావుడిగా ఇచ్చారని చిదంబరం తరఫు న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆక్షేపించారు! ఇలాంటి మాటలు వింటే.. గతంలో సీబీఐ, ఈడీ వ్యవహారాలు అప్పటి రాజకీయ నేతలను కాంగ్రెస్ వాళ్లు ముప్పుతిప్పలు పెట్టించిన వ్యవహారాలు గుర్తుకు రాకమానవు. చిదంబరం అరెస్టుకు సీబీఐ, ఈడీలు రెడీ అవుతున్న వైనాన్ని చూశాకా.. వంద గొడ్లు తిన్న రాబందు కథ గుర్తుకు వస్తే తప్పు పరిశీలించే వారిదికాదు.

'బాహుబలి' ఇంకా కలగానే ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?