Advertisement

Advertisement


Home > Politics - Political News

చంద్ర‌బాబు కుప్పం పై ఆశ‌లొదేసుకున్నట్టే?

చంద్ర‌బాబు కుప్పం పై ఆశ‌లొదేసుకున్నట్టే?

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడును ద‌శాబ్దాలుగా ఆద‌రిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కుప్పం. వాస్త‌వానికి చంద్ర‌బాబుకు కుప్పం సొంత నియోజ‌క‌వ‌ర్గం కాదు. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరి. ఆయ‌న సొంతూరు చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉంటుంది. 

చంద్ర‌గిరి నుంచినే ఆయ‌న తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు కూడా. అయితే రెండోసారే ఆయ‌న అక్క‌డ నుంచి నెగ్గ‌లేక‌పోయారు! చంద్ర‌గిరి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోవ‌డంతో.. కుప్పానికి వ‌ల‌స వెళ్లారు. మొద‌ట్లో ఎన్టీఆర్ పేరుతో చంద్ర‌గిరి నుంచి నెగ్గిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత అక్క‌డే పాగా వేశారు. సీఎం కావ‌డంతో ఆయ‌న‌కు ఎమ్మెల్యేగా నెగ్గ‌డం సులువు అయ్యింది.

అయితే 14 సంవ‌త్సరాలు పాటు త‌ను సీఎంగా ఉన్నా.. కుప్పాన్ని మాత్రం వెనుక‌బాటు నియోజ‌క‌వ‌ర్గంగానే ఉంచిన ఘ‌న‌త చంద్ర‌బాబుది! క‌నీసం కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చ‌లేక‌పోయిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌దే! అప్ప‌టికే రాయ‌ల‌సీమ ప్రాంతంలో మారుమూలు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాలు కూడా మున్సిపాలిటీలుగా మారాయి. 

అభివృద్ధికి వాటికి అలా ఆస్కారం ఏర్ప‌డింది. అయితే చంద్ర‌బాబు మాత్రం కుప్పాన్ని మున్సిపాలిటీ చేయ‌లేదు. ఇటీవ‌లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా కుప్పం మున్సిపాలిటీగా మారింది. స్థానిక ఎన్నిక‌లు జ‌రిగితే కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతాల‌ని ఆ పార్టీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది.

అద‌లా ఉంటే..కుప్పానికి నీటి విష‌యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగానే  శ్ర‌మిస్తోంది. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీళ్లందింద‌చే ప్ర‌య‌త్నాలు ఊపందుకున్నాయి. మ‌రోవైపు చంద్ర‌బాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయిన వేళా విశేషం గ‌త ఏడాది, ఈ ఏడాది కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కూడా మిగ‌తా రాయ‌ల‌సీమ ప్రాంతంలాగే మంచి వ‌ర్ష‌పాతం న‌మోదైంది, చెరువులు నిండాయి. 

దీంతో సాగు, తాగు నీటి క‌ష్టాలు తీరుతున్నాయి. ఒక‌వేళ ఈ సెంటిమెంట్ గ‌నుక ప‌ని చేస్తే తెలుగుదేశానికి కుప్పంలోనే కాదు రాయల‌సీమ‌లోనే ఓటు ప‌డే అవ‌కాశాలు త‌గ్గిపోతాయి.

మ‌రోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుప్పం మీద చాలా స్పెష‌ల్ కాన్స‌న్ ట్రేష‌న్ పెట్టారు. ఇది వ‌ర‌కే ఒక మాజీ ముఖ్య‌మంత్రికి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర‌స ఝ‌ల‌క్ లు ఇచ్చారు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. 

పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో కిర‌ణ్ త‌మ్ముడిని వ‌ర‌స‌గా ఓడించ‌డంలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కృషి చాలానే ఉంది! ఈ క్ర‌మంలో కుప్పం మీద కూడా ఆయ‌న అలాంటి కాన్స‌న్ ట్రేష‌నే పెడుతున్నారు. సామాజిక‌వ‌ర్గ స‌మీకర‌ణాల‌నుకూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుతోంది. 

గత ఎన్నిక‌ల్లోనే చంద్ర‌బాబు మెజారిటీ స‌గానికి స‌గం త‌గ్గింది. రెండో రౌండ్ కౌంటింగ్ వ‌ర‌కూ చంద్ర‌బాబు వెనుక‌బ‌డ్డారు కూడా! ఇక కుప్పం లోక‌ల్ గా జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేయాల‌నే ఉద్దేశంతో ఉంటే.. ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.  

చంద్ర‌బాబు కూడా హైద‌రాబాద్ కే ప‌రిమితం అయ్యారు. చుట్ట‌పు చూపుగా అమ‌రావ‌తిలో ఒక‌టీ రెండు రోజులు గ‌డుపుతున్నారు. కుప్పం వైపు వెళ్లి ఏడాది గ‌డిచిపోయిన‌ట్టుగా ఉంది. ఇలాంటి క్ర‌మంలో ఆయ‌నకు కూడా కుప్పం మీద ఆశ‌లు లేన‌ట్టుగా ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది.

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?