Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆర్టీసీ సమ్మె.. చేతులెత్తేసిన హైకోర్టు

ఆర్టీసీ సమ్మె.. చేతులెత్తేసిన హైకోర్టు

మొన్నటివరకు హైకోర్టుపై చిన్న ఆశ ఉండేది. ప్రభుత్వం ఎలాగూ పట్టువీడడం లేదు కాబట్టి, హైకోర్టు చొరవతో సమ్మెకు సత్వర పరిష్కారం దొరుకుతుందని అంతా ఆశించారు. హైకోర్టు కీలక తీర్పు వెలువరిస్తుందని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా హైకోర్టు చేతులెత్తేసింది. ఎటూ నిర్ణయం తీసుకోలేక, ఇవాళ్టికి విచారణకు వాయిదావేసింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టంచేసింది. తద్వారా ఆర్టీసీని సగం ప్రైవేటీకరిస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తాము రద్దుచేయలేమని పరోక్షంగా వెల్లడించింది. అయితే కేబినెట్ తీసుకున్న నిర్ణయం వెంటనే అమలుకాకుండా కొన్నాళ్లు స్టే ఇవ్వగలిగే అధికారం మాత్రం హైకోర్టుకు ఉంది. ఇప్పటికే ఈ పనిచేసిన హైకోర్టు, ఇంకా ఎన్ని రోజులు ఆ స్టే ను అలానే కొనసాగిస్తుందనేది అనుమానాస్పదం.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు హైకోర్టు. అదే సమయంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను చట్టవిరుద్ధం అని కూడా ప్రకటించలేదు. అందుకే మధ్యేమార్గంగా ఓ పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చర్చలకు ఒప్పించేందుకు అన్ని మార్గాల్ని అన్వేషిస్తోంది. కానీ అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు మెట్టుదిగడం లేదు. అన్నింటికీ కారణం విలీనం.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంతోనే చర్చలు ప్రారంభించాలని కార్మికులు పట్టుబడుతున్నారు. అటు ప్రభుత్వం మాత్రం విలీనం అనే అంశం లేకుండా చర్చలు జరపాలని చూస్తోంది. దీంతో చర్చల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని పరిష్కరించడం హైకోర్టు వల్ల కూడా కావడం లేదు. మరోవైపు కార్మికులపై ఎస్మా ప్రయోగించడానికి వీల్లేదని మాత్రం కోర్టు గట్టిగా చెప్పగలిగింది. కాబట్టి కేసీఆర్ కు ఇప్పుడు ఆ అవకాశం లేదు.

మరోవైపు కార్మికుల సమ్మె ఇవాళ్టితో 39వ రోజుకు చేరింది. నిన్న జరిగిన నిరసన కార్యక్రమాల్లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇంటిని చుట్టుముట్టారు కార్మికులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాలాచోట్ల కార్మికుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రయాణికుల విషయానికొస్తే వాళ్ల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. కాస్త డబ్బులు ఎక్కువ చెల్లించైనా, హైదరాబాద్ జనాలు మెట్రో, క్యాబ్స్ తో పాటు ఇతర సర్వీసుల్ని వాడుకుంటున్నారు. కానీ పల్లెలు, మండల కేంద్రాల్లో ప్రయాణికులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?