cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

రాజకీయాలపై నమ్మకం పెంచుతున్న జగన్

రాజకీయాలపై నమ్మకం పెంచుతున్న జగన్

ఓర్చినమ్మకు తేటనీరు అన్నది సామెత. ఏ రంగంలో అయినా సరే, ఓర్పుగా, ఓపికగా, సమర్థతతో పని చేసుకుంటూ వెళ్తే ఒకనాటికి అవకాశాలు అందుకుని ఓ స్థాయికి చేరుకోవచ్చు. కానీ రాజకీయాల్లో మాత్రం ఇది అంతగా వర్కవుట్ కాదని అనుభవజ్ఞులు అంటారు. లాబీయింగ్, కోటరీలు ఇలాంటి వ్యవహారాలు చాలా వుంటాయి. 

పల్లకీ మోసేదొకరు, పల్లకీలో కూర్చునేదొకరు. అధికారంలో లేనపుడు కష్టాలు అనుభవించి, అధికారపక్షానికి ఎదురొడ్డి, పోరాడి, పార్టీని నిలబెట్టేది ఒకరు. అధికారం అందగానే లాబీయింగ్ చేసి, కోటరీలను మంచి చేసుకుని పదవులు పొందేది వేరు అన్నట్లు వుంటుంది.

కానీ ఈ తరహా రాజకీయానికి వైఎస్ హయాంలో గండి పడింది. తనను దశాబ్దాల కాలంగా నమ్ముకున్నవారిని అందరినీ చేరదీసి ఆదరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. స్నేహానికి, నమ్ముకున్నవారికి ప్రాణం పెట్టేస్తారు వైఎస్ అని రాజకీయాలు పరిశీలించే వారందరికీ తెలిసిన విషయం. ఆ నమ్మకంతోనే, ఆ ధైర్యంతోనే, ఆ భరోసాతోనే తండ్రి మరణం అనంతరం సాహసం చేసి సోనియాను, కాంగ్రెస్ ను ఢీ కొన్నారు వైఎస్ జగన్.

కానీ రాజకీయాల్లో స్నేహానికి ప్రాణం పెట్టే వైఎస్ లాంటి వారు వుంటారు కానీ, విశ్వాసం చూపించి, ఆ ఫ్యామిలీనే నమ్ముకునే వారు కొందరే వుంటారని కొద్ది రోజుల్లోనే రుజువైంది.

ఆదుకోని కేవీపీ

తన ఆత్మ. తన కుటుంబసభ్యులైనా కేవిపి తరువాతే అని గర్వంగా చెప్పుకునేవారు వైఎస్ తన దోస్త్ కేవిపి రామచంద్రరావు గురించి. వైఎస్ అధికారంలో వున్నన్నాళ్లు అవిభవక్త  ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయనే చక్రం తిప్పుతూ వచ్చారు. దాదాపుగా షాడో సిఎమ్ అన్నంతగా ఎదిగారు. ఎవరైనా వైఎస్ కన్నా ముందు కేవిపి ని కలవాల్సిందే. అంత వైభోగానికి కారణమైన వైఎస్ కుటుంబాన్ని ఆయన చటుక్కున వదిలేసారు. వైఎస్ మరణం అనంతరం ఆయన మౌనంగా కాంగ్రెస్/సోనియా వైపే వుండిపోయారు.

వుండిపోతే వుండిపోవచ్చు,  కాంగ్రెస్ పార్టీ తో ఆయనకు అవసరానుబంధం వుండి వుండొచ్చు. కానీ కాంగ్రెస్ లో ఆయన మాట ఎంత చెల్లుబాటు అవుతుందో తెలియంది కాదు. ఆయన తలుచుకుంటే కేంద్ర రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పగలరో తెలియంది కాదు. కానీ జగన్ మీద కేసులు పడ్డాయి. చకచకా పరిణామాలు సంభవించాయి. అరెస్టు జరిగిపోయింది. ఒక్కనాడు కూడా జగన్ ను జైల్లో వుండగా కేవిపి పరామర్శించినట్లు వార్తలు రాలేదు.

పోరుబాటలో నమ్మకస్తులు

జగన్ జైలు నుంచి బయటకు వచ్చారు. కేసులు ప్రారంభమైన నాటి నుంచి ఎన్ని విధాల, ఎంత మందితో పోరాడాల్సి వచ్చిందో. ముఖ్యంగా సామాజిక బంధాలను తెలుగుదేశం పార్టీతో పెనవేసుకున్న మీడియా నుంచి ఎంత దారుణమైన క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వ హననం) ఎదుర్కోవాల్సి వచ్చిందో. ఈ క్రమంలో అధికారపక్షం ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగి ఎందరో జగన్ ను వీడిపోయారు.

జగన్ ప్రేమగా చూసుకున్న గిడ్డి ఈశ్వరి లాంటి వారు కూడా అనివార్యంగా దూరం అయ్యారు. మోపిదేవి, పిల్లి సుభాష్ లాంటి కొద్ది మంది కష్టనష్టాలకు ఓర్చి జగన్ తో వున్నారు. నందిగం సురేష్ లాంటి అతి సామాన్యుడు తెలుగుదేశం అధికార బలానికి తలొగ్గకుండా నిల్చున్నాడు. ఈరోజు ఎంపీ అయ్యాడు. ఇలాంటి వ్యక్తి తెలుగుదేశంలో కనిపిస్తాడా?

వెళ్లినవారంతా...

అధికారపక్ష అదలింపులకో, బెదిరింపులకో, ప్రలోభాలకో లేదా తమ అవసరాలకో పార్టీ మారడం అనివార్యం కావచ్చు. కానీ వెళ్లిపోతూ వెళ్లిపోతూ జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేసినవారు ఎందరో. జగన్ అహంకారి అని, ఒంటెత్తుపోకడలు అని ఇలా వ్యక్తిత్వ హననానికి పాలుపడినవారు ఎందరో? సబ్బం హరి దగ్గర నుంచి ఆదినారాయణ రెడ్డి వరకు ఇలా మాట్లాడినవారు ఎందరో? అందరిదీ ఒకటే రాగం, ఒకటే పాట, ఒకటే టాపిక్. అప్పుడే అర్థం అయింది. ఈ రాగానికి, ఈ పాటకు నేపథ్యం వేరే ఏదో అని. అయినా జగన్ జంకలేదు. అస్సలు ఇవి పట్టించుకున్న దాఖలానే లేదు.  దాదాపు తొమ్మిదేళ్లు జనంలోనే వున్నాడు. ఏదో ఒక టాపిక్. ఏదో ఒక కారణం. మొత్తం మీద తొమ్మిదేళ్లలో ఇంట్లో వున్నది నెలల్లో. జనంలో వున్నది ఏళ్లల్లో.

అండగా నిలబడి

ఇలాంటి కష్టకాలంలో జగన్ మీద నమ్మకంతో, జగన్ మీద విశ్వాసంతో, జగన్ నే నమ్ముకున్నవారు కూడా వున్నారు. అలా వున్నవారు ఇప్పుడు ఫలాలు అనుభవిస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వం అంటే కోట్లకు కోట్లు కురిపించే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలు క్యూలో వుంటారు. దాదాపుగా అన్ని పార్టీలు రాజ్యసభ సభ్యత్వాలను పార్టీ వనరుల కోసం వాడుకోవడం అలవాటు అయింది. తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డు చూస్తే అయితే పారిశ్రామిక వేత్తలు, లేదా తమ తమ సామాజిక వర్గ జనాలు క్లియర్ గా కనిపిస్తారు.

జగన్ మాత్రం కష్టకాలంలో తనతో అండగా వున్న మోపిదేవిని, పిల్లి సుభాష్ ను మరిచిపోలేదు. ఎమ్మెల్సీ వ్యవస్థ రద్దు చేస్తున్నా కాబట్టి వాళ్లను అక్కడితో వదిలేయలేదు. రాజ్యసభకు పంపించారు. అంతే కాదు,  చంద్రబాబు చాణక్యాన్ని ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించిన అనేకానేక మందికి, ఈ రాజకీయ యుద్ధంలో తనకు సహకరించిన అనేకానేక మందికి పదవులు పంచారు.

సామాజిక వర్గం

ఈ యుద్దంలో జగన్ వెంట నిలబడిన వారిలో బిసి లు వున్నారు. కాపులు వున్నారు. ఎస్సీ ఎస్టీలు వున్నారు. ఇలా అన్ని కులాల వారు వున్నారు. అయితే కీలకంగా రెడ్డి సామాజిక వర్గం కూడా వుంది. కమ్మ సామాజిక వర్గం ఒక్కటే మీడియాను అండగా పెట్టుకుని, జగన్ ను ఎంతలా టార్గెట్ చేయాలో అంతగా చేస్తుంటే, ఈ రెడ్డి సామాజిక వర్గం తమ నాయకుడిని తాము ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంది. ఎక్కడో జేసి బ్రదర్స్,  భూమా ఫ్యామిలీ లాంటి వాళ్లు దీనికి మినహాయింపు. కమ్మ సామాజిక వర్గంలో నాని, తలశిల రఘురామ్ లాంటి వాళ్లు తమ సామాజిక బంధాలు వీడి మరీ జగన్ తో వున్నారు.

మరి వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత జగన్ పై వుందా లేదా? ఇవ్వకపోతే, ఆదుకోకపోతే, అధికారం అందుకున్నాక వదిలేసాడు అంటారు. ఇస్తుంటే, అంత సామాజిక వర్గానికే ఇస్తున్నాడు అంటారు. చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయలేదా. ఎన్టీఆర్ హయాంలో వెదికి వెదికి కాకర్ల  సుబ్బారావు, కోనేరు రామకృష్ణారావు లాంటి వాళ్లను తీసుకువచ్చి అధికార పదవుల్లో పెట్టలేదా? ఒక్క ప్యామిలీ మినహా మరో ఫ్యామిలీ లేని ఇచ్చాపురం, చీపురుపల్లి లాంటి నియోజకవర్గాల్లో కమ్మవారికి టికెట్ లు ఇచ్చింది ఎన్టీఆర్ కాదా? శ్రీకాకుళం జిల్లా లాంటి బిసి జనాభా వున్న జిల్లాలో పార్టీ పగ్గాలు కమ్మవారికి అప్పగించిన దాఖలా లేదా?  విశాఖ వన్ లో వైశ్యులు, బ్రాహ్మణులు, మత్సకారులు వుంటే కంభంపాటి హరిబాబును చంద్రబాబు భాజపా ద్వారా ఎంకరేజ్ చేయలేదా?

అంటే ఎన్టీఆర్ చేస్తే మహానుభావుడు. తోకలు లేవు కనుక ఎవరు కమ్మో, కాపో తెలియదు కనుక నడచిపోతుంది. ఇక్కడ రెడ్డి అనే తోక వుంటుంది కనుక, లెక్క తీయొచ్చు. అంతే కదా? ఏ తోక వుందని సబ్బం హరికి చేరదీసి ఉత్తరాంధ్ర ఓదార్పు యాత్ర మొత్తం చేతిలో పెట్టారు. కోట్ల ఖర్చు ఆయన చేతుల మీదుగా చేయించారని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. ఏ తోక వుందని ఈస్ట్ పగ్గాలను కన్నబాబు చేతిలో వుంచి ముందుకు నడిపించారు. ఏ తోక వుందని అస్సలు ఏ అనుభవం లేదు, జనాల్లో గుర్తింపు లేదు అని అందరూ అన్నా గుడివాడ అమర్ నాధ్ ను ఎంపీ టికెట్ ఇచ్చి, ఓడిపోయినా మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

ఏ సామాజిక వర్గం అని పివిపిని దగ్గరకు తీసారు. ఏ కులం అని అనంతపురం లాంటి రెడ్డి-కమ్మ కోటలో బిసి కి టికెట్ ఇచ్చారు. జగన్ వల్ల పదవులు పొందినవారిలో రెడ్లు అధికంగా వుంటే వుండొచ్చు. కానీ బిసిలు, కాపులు కూడా అంతే సంఖ్యలో వున్నారు. కానీ రెడ్లు కనిపిస్తున్నారు. పైగా రాజకీయాల్లో జగన్ ను కనిపెట్టుకుని వున్నారు. కాచుకుని వున్నారు. వారికి ఇప్పుడు ఏదీ చేయకపోతే, రాజకీయాల్లో నమ్మకం అనే పదానికి, విశ్వాసం అనే పదానికి అర్థం వుండదు.

చంద్రబాబును నమ్ముకుని బాగుపడి, కింద నుంచి పైకి వచ్చిన రాజకీయ నాయకులు ఎంత మంది లెక్క తీస్తే తెలుస్తుంది ఈ నమ్మకం, విశ్వాసం అనే పదాలకు అర్థం. పార్టీలో తనకు అడ్డం పడే వారు వుండకూడదని, తోడల్లుడు దగ్గర నుంచి నాదెండ్లతో ప్రారంభించి, ఉపేంద్ర, జయప్రద, రేణుకా చొదరి ఇలా ఎంతో మందిని బయటకు సాగనంపారు. ఇది జగద్విదితం. పైగా ఇలా సాగనంపిన వారిలో స్వంత సామాజిక వర్గ జనాలు వుండడం విశేషం.

ఆరోపణ-ఆదర్శం

నమ్ముకున్నవారికి న్యాయం చేస్తాడు. నమ్ముకున్నవారి కోసం ప్రాణం పెడతాడు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు అన్నది ఇప్పుడు జగన్ పార్టీలో తెచ్చుకున్న పేరు. భవిష్యత్ లో అవసరం కోసమో, మళ్లీ ప్రలోభం కోసమో ఎవరైనా పార్టీ మారొచ్చు. కానీ ఈసారి అలా మారే ముందు రెండురకాల ఆలోచిస్తారు. జగన్ నమ్మకాన్ని దూరం చేసుకున్న గిడ్డి ఈశ్వరి, అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి ఇలాంటి అనేక మంది గురించి ఒక్క క్షణం, జగన్ విశ్వాసాన్ని చూరగొని ఏ అండా లేకున్నా రాజ్యసభకు వెళ్లిన మోపిదేవి, పిల్లి సుభాష్ లాంటి వారి గురించి రెండు క్షణాలు ఆలోచించి తీరతారు.

ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఓర్పు,  సమర్థత వుంటే ఎదగొచ్చు. జగన్ లాంటి నాయకులను నమ్ముకంటే ఎప్పటికైనా ఓ స్థాయికి చేరవచ్చు అనే నమ్మకాన్ని ఆయన రాజకీయాల్లో కలిగించాడు. రాజకీయాలకు అది కూడా అవసరమే

చాణక్య
writerchanakya@gmail.com

 


×