Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇది జ‌గ‌న్ స‌ర్కార్ ధైర్య‌మా? మూర్ఖ‌త్వ‌మా?

ఇది జ‌గ‌న్ స‌ర్కార్ ధైర్య‌మా? మూర్ఖ‌త్వ‌మా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ ప‌త్రిక ఏ రాజ‌కీయ పార్టీకి బాకా కొడుతుందో, ఏ చాన‌ల్ ఎవ‌రి భ‌క్తి చాన‌లో  రాష్ట్ర ప్ర‌జలంద‌రికీ తెలుసు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల్లో ఏదైనా వార్త వ‌స్తే అది టీడీపీ అభిప్రాయమ‌ని, అదే సాక్షి ప‌త్రిక‌లో వ‌స్తే వైసీపీ వాయిస్‌గా జ‌నం ఓ నిర్ణ‌యానికి వ‌స్తారు. ఎందుకంటే పేరుకు ప్ర‌జాప‌క్షం, త‌ట‌స్థం అని ప‌త్రిక‌లు, చాన‌ళ్లు ఎంత చెప్పినా...ఆచ‌ర‌ణ‌లో మాత్రం త‌మ‌త‌మ పార్టీల ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా వార్త‌ల‌ను మోస్తుంటాయి.

ప్ర‌స్తుతం మ‌నం సాక్షి ప‌త్రిక గురించి మాట్లాడుకుందాం. ఈ ప‌త్రిక డాక్ట‌ర్ వైఎస్సార్ బొమ్మ‌తో పాఠ‌కుల చెంత‌కు చేరుతుంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌యోజ‌నాల‌కే ప్ర‌థ‌మ ప్రాధాన్యం. ఈ ప‌త్రిక‌లో ఏ వార్త వ‌చ్చినా...అది జ‌గ‌న్ శ్రేయ‌స్సు కోరి ఉంటుంది, ఉండాలి కూడా. ఒక‌వేళ ఏదైనా వార్త ఇందులో ప్ర‌చుర‌ణ‌కు నోచుకోలేదంటే అది జ‌గ‌న్‌కు న‌ష్టం క‌లిగించేదిగా ఉంటుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ రోజు సాక్షి ఎడిటోరియ‌ల్ పేజీలో "న్యాయ‌మూర్తుల అన‌వ‌స‌ర బ‌దిలీలు" శీర్షిక‌తో ఓ వ్యాసం క‌నిపించింది. "సంద‌ర్భం" అనే కాల‌మ్‌లో మంగారి రాజేంద‌ర్ అనే ర‌చ‌యిత రాసిన వ్యాసం ఇది. వ్యాస‌క‌ర్త గ‌తంలో జిల్లా జ‌డ్జిగా, తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ స‌భ్యుడిగా ప‌నిచేసిన‌ట్టు వివ‌రాలు తెలిపారు. ఈ వ్యాసంలో వెల్ల‌డించిన అభిప్రాయాలపై చ‌ర్చించ‌డం ఈ ఆర్టిక‌ల్ ఉద్దేశం ఎంత మాత్రం కాదు. జ‌గ‌న్ ప‌త్రిక‌లో ఈ ఆర్టిక‌ల్‌ను ప్ర‌చురించ‌డం వైసీపీ శ్రేణుల‌కే ఆశ్చ‌ర్యంతో పాటు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

అస‌లే జ‌గ‌న్ స‌ర్కార్‌కు హైకోర్టు వ్య‌తిరేక‌మ‌న్న ప్ర‌చారం సాగుతున్న నేప‌థ్యంలో ...అదే హైకోర్టు జిల్లా జ‌డ్జిల‌ను బ‌దిలీలు చేయ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ రాయ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?  దీని వ‌ల్ల జ‌గ‌న్‌కు వ‌చ్చే లాభం ఏంటి? ఇంకా న్యాయ‌స్థా నంతో మ‌రింత దూరం పెంచుకోడానికే ఇలాంటి రాత‌లు ఆజ్యం పోసిన‌ట్టు కావా?

ఒక‌ వ్య‌క్తి లేదా వ్య‌వ‌స్థ‌తో ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన‌ప్పుడు సామ‌ర‌స్య వాతావ‌ర‌ణంలో చ‌ర్చించుకోవ‌డ‌మో లేదా ఆత్మ విమ‌ర్శ చేసుకోవ‌డం వ‌ల్లో త‌ప్పుల‌ను స‌రిదిద్దుకునే అవ‌కాశం ఉంటుంది. త‌ప్పులు లేదా పొర‌పాట్లు పున‌రావృతం కాకుండా చూసుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ ఏపీ హైకోర్టు చేసిన జిల్లా జ‌డ్జిల బ‌దిలీల‌పై సాక్షిలో ఆర్టిక‌ల్ రాయ‌డం ద్వారా...న్యాయ‌స్థానంతో ఢీ అంటే ఢీ అనే ధోర‌ణిలో ఏపీ స‌ర్కార్ ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

"మిగతా ఉద్యోగులు వేరు. న్యాయమూర్తులు వేరు. కిందికోర్టు న్యాయమూర్తులని అనవసర బదిలీల ద్వారా, అసౌకర్య బదిలీల ద్వారా బలిపశువులని చేస్తూ ఉంటారని సుప్రీంకోర్టు మింటూ మాలిక్‌ కేసులో (హైకోర్టు ఆఫ్‌ కలకత్తా వర్సెస్‌ మింటూ మాలిక్‌ మరియు ఇతరులు, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (సివిల్‌) నెం. 24240/2019, తీర్పు తేదీ నవంబర్‌ 15, 2019) అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, బి.ఆర్‌. గవాయ్‌లు ఈ తీర్పుని వెలువరించారు"....ఈ వాక్యాల‌తో ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారు?

ఏపీ హైకోర్టు కూడా జిల్లా జ‌డ్జిల‌ను బ‌లి ప‌శువుల‌ను చేస్తోంద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ వ్యాస‌క‌ర్త  మంగారి రాజేంద‌ర్ ద్వారా ప‌రోక్షంగా చెప్ప‌ద‌ల‌చుకుందా? జ‌గ‌న్ స‌ర్కార్‌లో ఈ విప‌రీత ధోర‌ణులు ఏంటి? ఎందుకీ అనాలోచిత నిర్ణ‌యాలు? న్యాయ‌స్థానాల‌తో గొడ‌వ ప‌డ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటి? ఇదేమైనా కురుక్షేత్ర సంగ్రామ‌మా? జ‌గ‌న్ శ్రేయ‌స్సును కాంక్షించే వాళ్లెవ‌రూ న్యాయ‌స్థానంతో ఘ‌ర్ష‌ణ వైఖ‌రిని స‌మ‌ర్థించ‌రు. ఈ వ్యాసాన్ని ప్ర‌చురించడం మొండి ధైర్య‌మా లేక మూర్ఖ‌త్వ‌మా? అనేది అర్థమే కావ‌డం లేదని జ‌గ‌న్ శ్రేయోభిలాషులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కానీ ఈ వ్యాసాన్ని ప్ర‌చురించ‌డం మాత్రం ముమ్మాటికీ "అసంద‌ర్భం" అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఏపీ స‌ర్కార్ తాజాగా హెచ్చ‌రిక

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?