Advertisement

Advertisement


Home > Politics - Political News

బీజేపీని క‌ల‌వ‌ర‌పెడుతున్న మ‌హిళా సీఎం

బీజేపీని క‌ల‌వ‌ర‌పెడుతున్న మ‌హిళా సీఎం

ఇండియా టుడే ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో నిర్వ‌హించిన తాజా స‌ర్వే వివ‌రాలు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీని కల‌వ‌ర పెడుతున్నాయి. ఈ స‌ర్వేలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి తిరుగులేని ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ....మ‌రో ఫ‌లితం బీజేపీ ఆందోళ‌న‌కు కార‌ణంగా క‌నిపిస్తోంది. ప్ర‌ధానిగా మోడీ ప‌నితీరు జ‌నం ఆహా, ఓహో అని అంటున్నార‌ని స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించ‌డం ఒక వైపు, మ‌రోవైపు ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీపై త‌ర‌గ‌ని ప్ర‌జాద‌ర‌ణ కేంద్ర అధికార పార్టీకి గుబులు రేపుతోంది.

ఇండియా టుడే ప‌త్రిక ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో  జూలై 15 నుంచి అదే నెల 27వ తేదీ మ‌ధ్య టెలిఫోన్ ద్వారా స‌ర్వేచేశారు. మొత్తం 12,021 మందితో మాట్టాడారు. ఈ స‌ర్వేలో 67 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో, 33 శాతం మంది ప‌ట్ట‌ణ ప్రాంతాల వారు ఉన్నారు. ఈ స‌ర్వేని 19 రాష్ట్రాల్లో 97 లోక్‌స‌భ‌, 194 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన‌ట్టు ఇండియా టుడే ప‌త్రిక పేర్కొంది.

ఈ స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం 87 శాతం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ముఖ్య‌మంత్రిగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మొద‌టి స్థానంలో నిలిచారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 63 శాతం, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ 59 శాతం, బిహార్ సీఎం నితీష్‌కుమార్ 55 శాతం ప్ర‌జాద‌ర‌ణ పొందారు. ఇక దేశంలోనే అత్యుత్త‌మ సీఎంగా నిలిచిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ మాత్రం త‌న సొంత రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం కేవ‌లం 49 శాతం మాత్ర‌మే ప్ర‌జాద‌ర‌ణ పొందారు.  

ప‌శ్చిమ‌బెంగాల్‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎలాగైనా ప‌శ్చిమ‌బెంగాల్‌లో పాగా వేయాల‌ని స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్న బీజేపీకి మ‌మ‌తాబెన‌ర్జీపై ఆ రాష్ట్రంలో 59 శాతం ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని స‌ర్వే ఫ‌లితాలు పేర్కొన‌డం ఆందోళ‌న క‌లిగి స్తోంది. మ‌రోవైపు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంకు సొంత రాష్ట్రంలో కేవ‌లం 49 శాతం ప్ర‌జాద‌ర‌ణ ల‌భించ‌డం కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప‌శ్చిమ‌బెంగాల్ మ‌హిళా సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ వ‌రుస‌గా రెండుసార్లు ఆ రాష్ట్రంలో గెలుపొంది తిరుగులేని నేత‌గా కొన‌సాగు తున్నారు. మ‌రోవైపు ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా విజ‌యం సాధించి హ్యాట్రిక్ సీఎంగా దేశ‌స్థాయిలో గుర్తింపు పొంద‌డానికి ఆమె త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

ఈ దేశంలోనే ప్ర‌ధాని మోడీని ధిక్క‌రించే ఏకైక సీఎంగా ఆమెకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం మోడీపై విమ‌ర్శ‌లు చేయ‌డం, ఆ త‌ర్వాత గుట్టుచ‌ప్పుడు కాకుండా లొంగిపోయిన నేత‌ల‌ను మ‌నం చూస్తున్నాం. దీనికి నిలువెత్తు నిద‌ర్శ‌నం మ‌న చంద్ర‌బాబునాయుడే. మోడీ అంటే చంద్ర‌బాబు ఎంత‌గా భ‌య‌ప‌డుతున్నాడంటే...మ‌మ‌తాబెన‌ర్జీ నుంచి వ‌చ్చిన ఫోన్‌కాల్స్‌ను కూడా అటెండ్ చేయ‌డం లేదు. మోడీపై ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ మొద‌ట్లో వ్య‌తిరేకంగా మాట్లాడి న‌ప్పటికీ...ఇప్పుడు లౌక్యంగా స‌ర్దుకుపోయారు.

ఇప్పుడు మ‌న‌కు మిగిలింద‌ల్లా కాంగ్రెసేత‌ర నేత‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జీ ఒక్క‌రే. బీజేపీకి మ‌మ‌తాబెన‌ర్జీ పంటి కింద రాయిలా త‌యార‌య్యారు. కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప‌శ్చిమ‌బెంగాల్‌లో తోక జాడిస్తున్న బీజేపీని ఎదుర్కోవ‌డంలో మ‌మ‌తాబెన‌ర్జీ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. బ‌హుశా ఆ ధిక్క‌ర‌ణ‌, వీరోచిత మ‌న‌స్త‌త్వమే మ‌మ‌తాబెన‌ర్జీకి త‌ర‌గ‌ని ఆద‌ర‌ణ తెచ్చి పెట్టిందేమో! ఈ స‌ర్వే ఫ‌లితాల‌ను చూస్తుంటే ప‌శ్చిమ‌బెంగాల్‌లో బీజేపీ క‌ల నెర‌వేరేలా లేదు. 

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?