Advertisement

Advertisement


Home > Politics - Political News

పాపం రజనీ.. ఈ నిరసన ఊహించి ఉండరు

పాపం రజనీ.. ఈ నిరసన ఊహించి ఉండరు

సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఎవరైనా ఎన్నాళ్లు ఓపిగ్గా ఉండగలరు? రజనీకాంత్ అభిమానుల విషయంలో ఇదే జరిగింది. తమ అభిమాన నాయకుడు పార్టీ పెడతాడని, సీఎం అవుతాడని ఓవైపు ఫ్యాన్స్ కలలుకంటుంటే.. మరోవైపు రజనీకాంత్ మాత్రం ఏడాదిగా తన రాజకీయ కార్యాచరణను వాయిదా వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు జరిగిన సమావేశంలో తొలిసారి అభిమాన వర్గాల నుంచి సున్నితమైన నిరసన ఎదుర్కొన్నారు సూపర్ స్టార్.

అభిమాన సంఘాలు, జిల్లా స్థాయి కార్యదర్శులతో ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైన రజనీకాంత్..  మరోసారి తన పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఎలాంటి ప్రకటన చేయకుండా..  ఆలోచనలు కలబోసుకున్నామని, అభిప్రాయాలు తెలుసుకున్నామంటూ పాత పాటే పాడారు. అయితే అభిమాన సంఘాలు మాత్రం ఈసారి రజనీకాంత్ కు చిన్న ఝలక్ ఇచ్చాయి.

తొందరగా పొలిటికల్ ఎంట్రీని ప్రకటించాలని అభిమానులు రజనీకాంత్ ను డిమాండ్ చేశారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందున, ఆలస్యం చేస్తే మనకే నష్టం కలుగుతుందని కొంతమంది కార్యదర్శులు, అభిమాన సంఘాల అధ్యక్షులు నేరుగా రజనీకాంత్ మొహం మీదే చెప్పేశారు. 

ఇన్నాళ్లూ రజనీకాంత్ కనిపిస్తే కలిసి ఫొటోలు దిగడానికి ఎగబడిన అభిమాన సంఘం అధ్యక్షులు.. ఇప్పుడిలా రజనీకాంత్ కు ఏకంగా సూచనలు చేసే స్థాయికి వెళ్లారు. ఇవన్నీ ఒకెత్తయితే.. వేదిక బయట జరిగిన హంగామా మరో ఎత్తు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొందరు రజనీకాంత్ అభిమానులు నినాదాలు చేశారు. 

పార్టీ పెడితే రజనీకాంత్ వెంట నడుస్తామన్న కొందరు ఫ్యాన్స్.. అదే సమయంలో బీజేపీతో కలిస్తే మాత్రం సహించేది లేదని సూటిగా చెప్పడం విశేషం. ఓవైపు రజనీకాంత్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. అభిమానుల తీరు ఇటు రజనీకి, అటు బీజేపీకి మింగుడుపడని అంశం.

ఈ సైడ్ లైట్స్ పక్కనపెడితే.. రజనీకాంత్ మాత్రం ఎప్పట్లానే తన నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేశారు. సాధ్యమైనంత త్వరలో తన పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే ఆయన ముక్తాయించారు. దీంతో అభిమానులు మరోసారి నిరాశచెందారు. మరికొందరు మాత్రం డిసెంబర్ 12న అసలైన ప్రకటన ఉంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

అసెంబ్లీలో చంద్రబాబు రచ్చ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?