Advertisement

Advertisement


Home > Politics - Political News

పవన్ భక్తుడా..? జగన్ శిష్యుడా..? ఎవరాయన..?

పవన్ భక్తుడా..? జగన్ శిష్యుడా..? ఎవరాయన..?

పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోగా.. ఏపీ అసెంబ్లీలో జనసేనకి ఎంట్రీ దక్కేలా చేసి అసలైన 'పవర్' స్టార్ అనిపించుకున్నారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కానీ ఆ పవన్ భక్తుడు, జగన్ శిష్యుడుగా మారడానికి ఎన్నోరోజులు పట్టలేదు. 

జనసేనాని జలసీతో, ఒక్కగానొక్క ఎమ్మెల్యేని దూరం పెట్టడంతో ఆయన వైసీపీ వైపుకి వచ్చేశారు. కొడుక్కి అధికార పార్టీ కండువా కప్పి తాను అనధికారిక ఎమ్మెల్యేగా మారిపోయారు. ఇక్కడే చిన్న మెలిక ఉంది. రాపాక అధికార పార్టీతో సయోధ్య కుదుర్చుకున్నా.. అధికార పార్టీ నేతలతో మాత్రం ఆయనకు ఇంకా పొత్తు పొసగలేదు. దీంతో రాజోలులో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది.

వాస్తవానికి రాజోలులో బొంతు రాజేశ్వరరావుపై స్వల్ప మెజార్టీతో గెలిచారు రాపాక. ఆ స్వల్ప మెజార్టీ కూడా రావడానికి కారణం వైసీపీలోని అమ్మాజీ అసమ్మతి వర్గం అనేది బహిరంగ రహస్యం. అధికార పార్టీలోనే రెండు వర్గాలు కలబడటంతో పరోక్షంగా అది రాపాకకు లాభం చేకూర్చింది. దీంతో ఎన్నికల తర్వాత కూడా బొంతు రాజేశ్వరరావు, అమ్మాజీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.

వైసీపీ అధికారంలోకి వచ్చాక అమ్మాజీని పార్టీ ఇన్ చార్జిగా నియమించారు. అంతేకాదు, ఆమెకు మాల కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీంతో ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆమె పార్టీపై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన బొంతు రాజేశ్వరరావుకి ఇటీవలే గ్రామీణ నీటి సరఫరా సలహా కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. నామినేటెడ్ పోస్ట్ రావడంతో ఆయన కూడా జూలు విదిల్చారు. తన వర్గాన్ని పక్కకు చేర్చుతూ నియోజకవర్గంలో పెత్తనం కోసం పాకులాడుతున్నారు.

అమ్మాజీ వర్సెస్ రాపాక..

రాజేశ్వరరావు సైలెంట్ గా ఉన్న రోజుల్లో.. అమ్మాజీ, రాపాక మధ్య మాత్రం కోల్డ్ వార్ ఓ రేంజ్ రో జరిగింది. రాపాకకు కనీసం సొంత ఊరి సర్పంచ్ ని ఎంపిక చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశారట అమ్మాజీ. దీంతో రాపాక రెబల్ అభ్యర్థిని గెలిపించుకోవడంతో వివాదం పెద్దదైంది. 

అంతే కాదు.. అధికారుల బదిలీల్లోనూ అమ్మాజీ పెత్తనం ఉండేదట. ఉంటే ఉంది అని రాపాక సైలెంట్ గా ఉంటే... ఆయన వద్దన్నవారికే అమ్మాజీ కావాలని పోస్టింగ్ ఇప్పించుకునేవారట. ఇలా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సందర్భంలో.. రాజేశ్వరరావు నామినేటెడ్ పోస్ట్ వచ్చాక కాస్త హుషారయ్యారు. దీంతో ప్రస్తుతం ఈ కోల్డ్ వార్ కాస్తా.. మూడు ముక్కలాటగా మారింది.

అమ్మాజీ తన వర్గాన్ని పక్కకు లాగేశారు. రాపాక జనసేన పాత వర్గాన్ని, వైసీపీలోకి వచ్చాక ఆయన వెంట నడిచినవారితో మరో వర్గం కట్టారు. ఇక బొంతు రాజేశ్వరరావుకి ఉన్న సొంత వర్గం ఎలాగూ ఉంది. ఇలా ఈ ముగ్గురూ మూడు కూటములు కట్టి రాజోలులో వైసీపీని బలహీనం చేస్తున్నారనే విషయం అధిష్టానం దృష్టికి వచ్చింది. మాటలతో సమస్య సర్దుబాటు కాలేదు. దీంతో ముగ్గుర్నీ ఒకేసారి రమ్మని తాడేపల్లి నుంచి కబురొచ్చింది.

ఈసారైనా వీరి మధ్య సయోధ్య కుదురుతుందా..? లేక ముగ్గురికీ అధిష్టానం తలంటాల్సిందేనా అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. రాపాక ఇంకా పవన్ భక్తుడిగానే ఉన్నారా..? జగన్ శిష్యుడిగా మారిపోయారా అనేది తేలాల్సి ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?