Advertisement

Advertisement


Home > Politics - Political News

వైసీపీలో ట్ర‌బుల్ షూట‌ర్ ఎవ‌రు?

వైసీపీలో ట్ర‌బుల్ షూట‌ర్ ఎవ‌రు?

ఏపీ అధికార పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ ఎవ‌రు? ఇప్పుడీ ప్ర‌శ్న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఏడు నెల‌ల జ‌గ‌న్ స‌ర్కార్ పాల‌న‌లో అతి పెద్ద స‌వాల్ రాజ‌ధాని రూపంలో ఎదురైంది. ఇది ఒక్క వైసీపీకి మాత్ర‌మే స‌వాల్ కాదు...ప్ర‌తిప‌క్ష టీడీపీకి కూడా అతిపెద్ద స‌వాలే. అయితే టీడీపీలో స‌వాళ్ల‌ను ఎదుర్కొని, ప‌రిష్కార మార్గం చూపే వాళ్లు చాలా మందే ఉన్నారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుల‌ను ప్ర‌ధానంగా చెప్పుకోవ‌చ్చు. వారిద్ద‌రి సూచ‌న‌లను తూ.చా త‌ప్ప‌క ఆచ‌రించ‌డానికి టీడీపీలో పెద్ద నెట్‌వర్క్ ఉంది. 

 వైసీపీ విష‌యానికి వ‌ద్దాం. ట్ర‌బుల్ షూట‌ర్ల మాట ప‌క్క‌న పెడదాం. ట్ర‌బుల్ మేక‌ర్లు, క్రియేట‌ర్లు చాలా మందే ఉన్నారు. వీరిలో వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత  లిస్ట్ క‌నిపిస్తుంది. అధికార పార్టీగా ఓ స‌మ‌స్య‌ను డీల్ చేయ‌డంలో వైసీపీ ఎంత బ‌ల‌హీనంగా ఉందో రాజ‌ధాని స‌మ‌స్యే అతి పెద్ద నిద‌ర్శ‌నం. 

చంద్ర‌బాబు అవినీతి, విప‌రీత ధోర‌ణులు, క్ష‌మించ‌రాని త‌ప్పిదాలు, ఎలాగైనా చంద్ర‌బాబు ఓడించాల‌నే ప‌ట్టుద‌ల ప్ర‌జ‌ల్లో క‌నిపించ‌డం వ‌ల్ల వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాడు. ఇదే స‌మ‌యంలో 3వేలకు పైగా కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌కు ఒక్క అవ‌కాశం ఇచ్చి చూద్దామ‌ని ప్ర‌జానీకం పెద్ద మ‌న‌సు చేసుకొని ఓట్లు వేశారు. అంతే త‌ప్ప వైసీపీ గొప్ప‌గొప్ప వ్యూహాలు, ఎల‌క్ష‌న్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండ‌టం వ‌ల్ల అధికారంలోకి రాలేదు. 

ఏది ఏమైతేనేం 151 సీట్లతో పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టిన జ‌గ‌న్‌...ప‌డుతూ లేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఏడు నెల‌ల పాల‌న‌లో రాజ‌ధాని మార్పు అనే సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నాడు. స‌హ‌జంగా జ‌గ‌న్ అంటేనే ఓ సంచ‌ల‌నం. ఆయ‌న నిర్ణ‌యాల‌న్నీ ర‌చ్చ లేనిదే ఉండ‌వు. ప్ర‌జావేదిక కూల్చివేత మొద‌లుకుని, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మం వ‌ర‌కు అన్నీ ర‌చ్చ‌లే. ఏ విధ‌మైన అల‌జ‌డి లేకుండా పాల‌న సాగ‌డం జ‌గ‌న్‌కు ఇష్టం లేన‌ట్టుంది.

దాదాపు 40 రోజులుగా ఏపీలో రాజ‌ధాని వివాదం న‌డుస్తోంది. అస‌లు అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్ రాజ‌ధానుల‌పై ప్ర‌క‌ట‌న మొద‌లుకుని ప్ర‌తి ఒక్క‌టీ త‌ప్ప‌ట‌డుగే అని రాజ‌కీయ విశ్లేష‌కులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతెందుకు రాజ‌ధానిపై ప్ర‌భుత్వం త‌ర‌పున వాదించేందుకు నియ‌మితులైన సుప్రీంకోర్టు ప్ర‌ముఖ లాయ‌ర్ ముకుల్ రోహ‌త్గీ ఇటీవ‌ల జ‌గ‌న్‌ను క‌లిసిన‌ప్పుడు ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశార‌ని స‌మాచారం. "అస‌లు ఈ త‌ల‌నొప్పి ఎందుకు తెచ్చుకున్నారు. హాయిగా ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ ఇచ్చి ఉంటే స‌రిపోయేది. మీర‌నుకున్న‌ల‌క్ష్యం సుల‌భంగా నెర‌వేరేది" అని చెప్పాడ‌ట‌. 

దీంతో జ‌గ‌న్‌కు దిమ్మ తిరిగి బ్లాక్ అయ్యింద‌ట‌. "గోటితో పోయేదానికి గొడ్డ‌లి వ‌ర‌కు తెచ్చుకున్న‌ట్టైంది" అని జ‌గ‌న్‌తో పాటు ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. "చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న" చందంగా రాజ‌ధానిపై వైసీపీ స‌ర్కార్ నిర్ణ‌యాలున్నాయి. పోనీ ప్ర‌క‌టించారు, ఇంకో త‌ప్పు జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి క‌దా? అబ్బే ఆలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటే జ‌గ‌న్ పాల‌న ఎందుక‌వుతుంది? 

అసెంబ్లీలో బిల్ల‌లు పాస్ చేసి శాస‌న‌మండలికి పంపారు. మండ‌లిలో వైసీపీకి బ‌లం లేద‌ని తెలుసు. అందులోనూ అక్క‌డేమైనా సామాన్యులున్నారా? ప‌్ర‌ధానంగా మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్ ప‌క్కా టీడీపీ. అస‌లే చ‌ట్టాలను న‌మిలి పీల్చి పిప్పి చేసిన య‌న‌మ‌ల రామ‌కృష్ణుడూ ఉన్నాడు. ఇక వ్యూహాలు ప‌న్న‌డంలో చంద్ర‌బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. మండ‌లిలో రూల్ 71 ప్ర‌వేశ పెట్టి అస‌లు వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లులను అనుమ‌తించ‌లేదు. 

అప్ప‌టికి గానీ తామెంత పెద్ద త‌ప్పు చేశామో వైసీపీ స‌ర్కార్‌కు అర్థం కాలేదు. ఆ రోజు సాయంత్రానికి అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం మండ‌లిలో బిల్లులు ప్ర‌వేశ పెట్ట‌డానికి అనుమ‌తి ల‌భించింది. అప్ప‌టికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీల‌కు టీడీపీ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. ఆ మ‌రుస‌టి రోజు బిల్లుల‌పై చ‌ర్చించి తిరిగి శాస‌న‌స‌భ‌కు పంపుతార‌ని జ‌గ‌న్ స‌ర్కార్ అమాయ‌కంగా ఆశించింది. నిజానికి వైసీపీది అమాయ‌క‌త్వం కూడా కాదు. వైసీపీది అజ్ఞానం, అహంకారం. 

అయితే తామొక‌టి త‌లిస్తే టీడీపీ మ‌రొక‌టి త‌లిచింది. సెలెక్ట్ క‌మిటీకి పంపాల‌ని టీడీపీ ప‌ట్టుబ‌ట్టింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పంప‌కూడ‌ద‌ని వైసీపీ ప‌ట్టుబ‌ట్టింది. అయితే సెలెక్ట్ క‌మిటీకి పంపాల‌ని ఎట్ట‌కేల‌కు చైర్మ‌న్ ష‌రీఫ్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ల‌బోదిబోమ‌న్నారు. పుణ్య‌కాలం మించిపోయాక ఎంత మొత్తుకుంటే ఏం లాభం?

వైసీపీ స‌ర్కార్ ఓ ప్ర‌తిష్టాత్మ‌క నిర్ణ‌యం తీసుకుని బిల్లులు ప్ర‌వేశ పెట్టాల‌నుకున్న‌ప్పుడు న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించ‌డం, జాగ్ర‌త్త‌గా అడుగులు వేయ‌డం, వ్యూహాత్మ‌కంగా పావులు క‌ద‌ప‌డం లాంటివేవీ నామ మాత్రంగా కూడా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు మండ‌లి ర‌ద్దు నిర్ణయం కూడా ఏ విప‌త్క‌ర ప‌రిస్థితుల‌కు దారి తీస్తుందో కూడా తెలియ‌డం లేదు. ఒక స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మ‌రో స‌మ‌స్య‌ను సృష్టించుకోవ‌డ‌మే అనేలా  వైసీపీ స‌ర్కార్ ధోర‌ణులు క‌నిపిస్తున్నాయి. 

ఇదేమి వైప‌రీత్య‌మో అర్థం కాక వైసీపీ శ్రేణులే త‌ల కొట్టుకుంటున్నాయి. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ స‌ర్కార్ రాజ‌ధానిపై జ‌రిగిన పొర‌పాట్ల‌ను, త‌ప్పుల‌ను నిజాయితీగా విశ్లేషించుకుని, వాటిని గుణ‌పాఠాలుగా స్వీక‌రించి...సంబంధిత రంగాల్లో నిపుణులైన వారితో చ‌ర్చిస్తూ మున్ముందు జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

రామోజీరావుని సూటిగా అడుగుతున్నా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?