నేతలను చేర్చుకుంటే అధికారంలోకి రావొచ్చా..?

ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలు ఉత్పత్తులను అమ్ముకునే కంపెనీల మాదిరిగా మారిపోయాయి. కంపెనీలు అంతేకదా. తాము తయారుచేస్తున్న రకరాల ఉత్పత్తులను అమ్ముకోవడానికి జోరుగా ప్రమోషన్‌ వర్క్‌ సాగిస్తాయి. కొందరు ఉద్యోగులను నియమించుకొని ఇంటింటికీ పంపి…

ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలు ఉత్పత్తులను అమ్ముకునే కంపెనీల మాదిరిగా మారిపోయాయి. కంపెనీలు అంతేకదా. తాము తయారుచేస్తున్న రకరాల ఉత్పత్తులను అమ్ముకోవడానికి జోరుగా ప్రమోషన్‌ వర్క్‌ సాగిస్తాయి. కొందరు ఉద్యోగులను నియమించుకొని ఇంటింటికీ పంపి ఉత్పత్తులను అమ్మిస్తాయి. వాళ్లు తమ ఉత్పత్తులు ఎంత గొప్పవో వివరించి, కన్విన్స్‌ చేసి ఎంతోకొంత అంటగట్టి వెళతారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఇదే పంథాలో వెళుతున్నాయి. పార్టీని బలోపేతం చేయడానికి, విస్తరింపచేయడానికి ఇతర పార్టీల్లోని నాయకులను (పదవులు ఉన్నవారిని, లేనవారిని) తమ పార్టీలోకి వచ్చేటట్లు చేసుకోవడమే మార్గమంటున్నాయి. అధికార పార్టీలు, ప్రతిపక్షాలు అన్నీ ఇదేపని. అధికారంలోకి రావడానికి, అధికారంలో ఉంటే దాన్ని నిలబెట్టుకోవడానికి ఫిరాయింపుల మేళా నిర్వహించడమొక్కటే మార్గంగా కనబడుతోంది. పార్టీలు ఫిరాయించడం రకరకాల కారణాలతో జరుగుతుంది.

అధికారం ఉన్నా, లేకపోయినా జీవితాంతం ఒకే పార్టీలో కొనసాగేవారు బాగా తగ్గిపోయారు. కమిట్‌మెంట్‌ ఎక్కువ ఉండే నాయకులు కమ్యూనిస్టు పార్టీల్లో, బీజేపీలో (ఒకప్పుడు జనసంఘ్‌) ఉండేవారు. కాని ఆ పార్టీల్లోనూ నిబద్ధత ఉన్న నాయకులు లేకుండాపోతున్నారు. పార్టీని బలోపేతం చేయాలంటే ఫిరాయింపులొక్కటే మార్గమని భావిస్తున్న అధినేతలు, నాయకులు ఆ ఒక్క పని మీదనే ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే బీజేపీ పార్టీ ఫిరాయింపుల పనిలో తలమునకలుగా ఉంది. తెలంగాణను తీసుకుంటే రాష్ట్ర విభజన జరిగి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి ఫిరాయింపులు జోరుగా జరిగాయి. కేసీఆర్‌ మొదటి టర్మ్‌లో టీడీపీ శాసన సభాపక్షం, రెండోటర్మ్‌లో కాంగ్రెసు శాసనసభా పక్షం ఖతమయ్యాయి. విడిగా చాలామంది చేరారనుకోండి.

పుంజుకున్న కొత్త ట్రెండ్‌ ఏమిటంటే… పార్టీ అధినేతలు లేదా కీలక నాయకులు పనిగట్టుకొని ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి వారిని తమ పార్టీలోకి తెచ్చుకోవడం. రెండోసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఒకప్పుడు టీడీపీలో కీలక నాయకుడైన మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయన్ని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించి తెచ్చుకున్నారు. అప్పటికే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాని కీలక పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో తన కూతురు కవిత విజయానికి మండవ ఉపయోగపడతారని కేసీఆర్‌ ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో ఒకప్పటి టీడీపీ లీడర్‌, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్‌ స్వయంగా పార్టీలోకి తీసుకొచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ప్రముఖపాత్ర పోషించి, మంత్రిగా పనిచేసి, రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెసు విజయానికి దోహదపడిన నిజమాబాద్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ అలియాస్‌ డీఎస్‌ టీఆర్‌ఎస్‌లోకి ప్రత్యేకంగా రప్పించారు. కేటీఆర్‌, హరీష్‌రావు రాయబారాలు చేసి చాలామందిని పార్టీలోకి తీసుకొచ్చారు. ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఇప్పుడు ఇదేదారిలో బీజేపీ నడుస్తోంది. తెలంగాణలో బలపడాలని, వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలని ఉబలాటపడుతున్న కాషాయం పార్టీ పనిగట్టుకొని నాయకులను వెతుకుతోంది. ఫిరాయింపులను ఓ యజ్ఞంలా నిర్వహిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఇతర నాయకులు రాజకీయాలు వదిలేసి కాలక్షేపం చేస్తున్న నాయకుల ఇళ్లకు వెళ్లి పార్టీలోకి రమ్మని వేడుకుంటున్నారు.

ఉమ్మడి ఏపీలో టీడీపీలో కీలకపాత్ర పోషించిన మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులును బీజేపీలోకి ఆహ్వానించారు. మాట ఇచ్చిన ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు గవర్నర్‌ పదవి ఇప్పించలేకపోవడంతో ఆయన బాబుకు దూరమయ్యాడు. చివరకు నానాతిట్లు తిట్టి, బాబును శాపనార్థాలు పెట్టి బయటకు వచ్చాడు. ఈయన వీరంగం చూడగానే పార్టీ నుంచి బహిష్కరించారనుకోండి. ఈయన దళిత నాయకుడు కాబట్టి ఏమైనా ఉపయోగపడతాడని బీజేపీ ఆశకావొచ్చు.

మాజీ ఎమ్మెల్యే నందీశ్వర గౌడ్‌ ఇంటికి లక్ష్మణ్‌ వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికలనాటికి ఇంకెంతమందిని ఆహ్వానిస్తారో. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణలోనే సభ్యత్వం తీసుకుంటారని చెబుతున్నారు. ఒకప్పుడు బీజేపీని సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీగా చెప్పుకునేవారు. విలువలకు ప్రాధాన్యమిచ్చే పార్టీగా పేరుండేది. అంతలా మడికట్టుకొని కూర్చుంటే కష్టమని మోదీ-అమిత్‌ షా భావించారు. ఒక్కో రాష్ట్రాన్ని కాషాయమయం చేయడమే ఇప్పుడు ప్రధానలక్ష్యం. నాయకులను చేర్చుకున్నంతమాత్రాన తెలంగాణలో అధికారం దక్కుతుందా? అది వారి విశ్వాసం. ఏం చెప్పగలం?

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్