పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడవే నిజమయ్యాయి. పూరి-విజయ్ కాంబోలో మూవీ లాక్ అయింది. కొద్దిసేపటి కిందట అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా వచ్చేసింది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై చార్మి, పూరి నిర్మాతలుగా ఈ సినిమా రానుంది.
ప్రస్తుతానికైతే అధికారిక ప్రకటన ఇంతవరకే ఉంది. కానీ తెరవెనక మాత్రం కసరత్తు అప్పుడే మొదలైంది. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న పూరి జగన్నాధ్.. విజయ్ దేవరకొండ సినిమాకు మణిశర్మనే రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. మ్యూజిక్ విషయంలో ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంతో విజయ్ దేవరకొండ కూడా ఏకీభవించాడు.
ఇక హీరోయిన్ గా రష్మికను మరోసారి రిపీట్ చేయాలా వద్దా అనే అంశంపై చర్చలు సాగుతున్నాయి. పూరి కనెక్ట్స్ నుంచి ఓ అమ్మాయిని సెలక్ట్ చేద్దామని చార్మి ప్రతిపాదించింది. రష్మిక లాంటి స్టార్ ఉంటే బాగుంటుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడట.
వీలైనంత త్వరగా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'హీరో' సినిమా ఆగిపోయింది. ఆ సినిమా త్వరలోనే స్టార్ట్ అవుతుందని మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలు చెబుతున్నప్పటికీ, విజయ్ దేవరకొండ వర్గీయులు మాత్రం ఆ సినిమా దాదాపు ఆగిపోయినట్టేనని చెబుతున్నారు. సో.. క్రాంతి మాధవ్ తో సినిమా కంప్లీట్ అయిన వెంటనే, పూరి జగన్నాధ్ తో సినిమాను స్టార్ట్ చేస్తాడు విజయ్ దేవరకొండ.
హీరోల్ని డిఫరెంట్ గా చూపించే పూరి జగన్నాధ్, విజయ్ కోసం కూడా ఓ కొత్త గెటప్ రెడీ చేసి పెట్టాడు. త్వరలోనే ఆ కొత్త లుక్ లోకి మారబోతున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ కోసం ఈ కథను ప్రత్యేకంగా రాయలేదు పూరి జగన్నాధ్. తన దగ్గరున్న స్టోరీ లైబ్రరీ నుంచి ఈ కథను పిక్ చేసుకున్నాడు.