సంక్షోభంలో అవ‌కాశం.. చంద్ర‌బాబు ఢిల్లీ టూర్!

త‌ను సంక్షోభాల్లోనే అవ‌కాశాల‌ను వెదుక్కొంటానంటూ అనేక సార్లు చెప్పి ఉంటారు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు. మ‌రి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డీప్ ట్ర‌బుల్స్ లో ఉంది. అది తెలుగుదేశం పార్టీ ఆఫీసుల‌పై దాడి…

త‌ను సంక్షోభాల్లోనే అవ‌కాశాల‌ను వెదుక్కొంటానంటూ అనేక సార్లు చెప్పి ఉంటారు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు. మ‌రి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డీప్ ట్ర‌బుల్స్ లో ఉంది. అది తెలుగుదేశం పార్టీ ఆఫీసుల‌పై దాడి వ్య‌వ‌హారం కాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు లేక‌పోతే టీడీపీ ప‌రిస్థితి ఏమిట‌నేదే? ఆ పార్టీ శ్రేణుల‌ను తీవ్రంగా ఆలోచింప‌జేస్తున్న అంశం. చంద్ర‌బాబు నాయక‌త్వంలో టీడీపీ ఎప్పుడూ సోలోగా ఎన్నిక‌ల్లో నెగ్గింది లేదు. వాళ్లూ వీళ్లూ త‌లా ఒక చేయి వేస్తేనే టీడీపీకి అధికారం అందుతుంది త‌ప్ప‌, సోలోగా స‌త్తాతో అధికారాన్ని అందుకునేంత సీన్ లేదు చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని టీడీపీకి. పొత్తులు ఉంటే మాత్ర‌మే టీడీపీ పోరాడ‌గ‌ల‌ద‌ని.. ఆ పార్టీ ప్ర‌స్థానం చాటి చెబుతూ ఉంది.

ఇలాంటి నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. బీజేపీ గ‌నుక తెలుగుదేశాన్ని ప‌ట్టించుకోక‌పోతే.. అధికారం గురించి ఆలోచించేంత సీన్ కూడా ఉండ‌దు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మోడీ హ‌వా పాజిటివ్ గా ఉంటే, అప్పుడు బీజేపీ గ‌నుక తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వ‌స్తే.. వీరికి తోడు ఎలాగూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉంటాడు కాబ‌ట్టి.. అనే లెక్క‌లే టీడీపీ కి అంతో ఇంతో ఊర‌ట‌ను ఇస్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలాగూ టీడీపీకే మ‌ద్ద‌తుగా నిలుస్తాడనే క్లారిటీ వ‌చ్చింది. ఇక బీజేపీ ని మ‌రోసారి బ‌క‌రా చేసుకోవాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబుకు ఉంది.

ఈ సంక్షోభంలో చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ టూర్ వేస్తున్నారు.  ఊరికే ఢిల్లీకి వెళితే అక్క‌డ ప‌ట్టించుకుంటారో లేదో అనే లెక్క‌ల‌తో 36 గంట‌ల పాటు దీక్ష చేసి మ‌రి వెళ్తార‌ట‌. అలా అయినా అయితే సానుభూతితో ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్ అయినా ల‌భిస్తుంద‌నే లెక్క కాబోలు. చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌య‌నం వెనుక ప‌క్కా పొత్తు ప్ర‌య‌త్నాలు ఉన్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. త‌న పార్టీ ఉనికిని కాపాడేది పొత్తులే కాబ‌ట్టి.. వాటి కోసం ఇప్ప‌టి నుంచినే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాల‌ను తీవ్రం చేస్తున్న‌ట్టుగా ఉన్నారు.

మ‌రి ఆ ప్ర‌య‌త్నాల‌కు బీజేపీ నుంచి ఈ సారి ఎలాంటి స్పంద‌న ఉంటుంద‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఒక‌వైపు ఏపీ బీజేపీ నేత‌లు కొంద‌రు, ఏపీ బీజేపీ ఇన్ చార్జిలు.. చంద్రబాబుపై అస‌హ్యాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. టీడీపీతో పొత్తు ప్ర‌స‌క్తే లేదంటున్నారు. టీడీపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతామంటున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం.. క‌మ‌లంలో త‌న ప్ర‌యాణాన్ని మ‌ళ్లీ మొద‌లుపెట్టే ప్ర‌య‌త్నాల‌ను మొద‌లుపెడుతున్నారు.