హత్య కేసులో భార్యకు శిక్ష.. బతికొచ్చిన భర్త

చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చాడంటూ ఇప్పటికే కొన్ని వార్తలు చూశాం. ఇది వాటికి మించిన స్టోరీ. నిజంగా జరిగిన కథ. సినిమాలా అనిపించే వాస్తవం. బిహార్ లో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.…

చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చాడంటూ ఇప్పటికే కొన్ని వార్తలు చూశాం. ఇది వాటికి మించిన స్టోరీ. నిజంగా జరిగిన కథ. సినిమాలా అనిపించే వాస్తవం. బిహార్ లో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇంతకీ ఏం జరిగింది?

బిహార్ లోని బెఠియా జిల్లాకు చెందిన రామ్ బహదూర్ కు భార్య దేవి, కుమారుడు ఆకాష్ సింగ్ ఉన్నారు. ఉండేది బిహార్ లోనే అయినప్పటికీ వృత్తి రీత్యా గుజరాత్ లో ఉంటున్నాడు రామ్ బహదూర్. ఈ క్రమంలో 2015లో ఓసారి బిహార్ వచ్చాడు. తమ్ముడు వికాస్ కుమార్ కు యాక్సిడెండ్ లో కాలు విరిగితే పరామర్శించాడు. తిరిగి గుజరాత్ వెళ్లిపోతాడు. అంతే, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.

యాక్సిడెంట్ నుంచి కోలుకున్న వికాస్ కుమార్, అన్నను చూసేందుకు బెఠియా వెళ్లాడు. అక్కడ తన అన్న భార్య వితంతువుగా కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన అన్న ఏమయ్యాడో కనుక్కునే ప్రయత్నం చేశాడు. అదే టైమ్ లో వదిన, ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన సమాధానాలు అతడికి అనుమానం రేకెత్తించాడు.

అన్న మరణంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కానీ సతి, రామ్ నగర్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదుచేయడానికి అంగీకరించలేదు. దీంతో అతడు కోర్టులో కేసు వేశాడు. కోర్టు ఆదేశాల మేరకు రామ్ మనోహర్ భార్య, తల్లిదండ్రుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడేళ్లుగా రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. ఎట్టకేలకు హైకోర్టులో వీళ్లకు బెయిల్ దొరికింది. సరిగ్గా అప్పుడే రామ్ బహదూర్ ప్రత్యక్షమయ్యాడు. అంతా షాక్.

రామ్ బహదూర్ ఎలా ప్రత్యక్షమయ్యాడు

గుజరాత్ కు పనిమీద వెళ్లిన రామ్ బహదూర్.. కొంతకాలం తర్వాత తిరిగి ఇంటికి బయల్దేరాడు. అయితే దారిలో యాక్సిడెంట్ అయింది. అతడి స్నేహితుడు అతడ్ని దగ్గర్లోనే హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. తలకు దెబ్బ తగలడంతో రామ్ బహదూర్ కోమాలోకి వెళ్లిపోయాడు. అదే టైమ్ లో అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేసిన స్నేహితుడు కరోనాతో మరణించాడు.

కోమా నుంచి బయటకొచ్చిన రామ్ బహదూర్ గతం మరిచిపోయాడు. తన గతం కోసం అతడు చాలా ట్రై చేశాడు. ఎట్టకేలకు వైద్యుల సహకారంతో తన గతానికి చెందిన ఆనవాళ్లకు గుర్తుకుతెచ్చుకోగలిగాడు. కొడుకు పేరు మాత్రం గుర్తొచ్చింది. ఫేస్ బుక్ లో ప్రయత్నిస్తే కొడుకు ఫోన్ నంబర్ దొరికింది. వెంటనే ఫోన్ చేశాడు. నిజంగా అది అతడి కొడుకు ఫోన్ నంబరే. వెంటనే కొడుకు, భార్య వెళ్లి రామ్ బహదూర్ ను ఇంటికి తీసుకొచ్చారు.

జరిగిన విషయం మొత్తాన్ని పోలీసులకు, కోర్టుకు తెలియజేశాడు రామ్ బహదూర్. దీంతో కేసును మొదట్నుంచి మరోసారి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. జరిగిన ఘటనపై సతి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఉపేంద్రనాథ్ వర్మ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటుచేసి, కేసును మళ్లీ  మొదట్నుంచి దర్యాప్తు చేయిస్తున్నట్టు ప్రకటించారు.